▼

9, అక్టోబర్ 2026, శుక్రవారం

శీతో భవ హనూమతః - సీతమ్మ మహత్తు



మొత్తం రామాయణంలో సీతమ్మ మహత్తును తెలిపే ఘట్టాలు ఎన్నో. వాటిలో సుందరకాండలో హనుమంతుని లాంగూలానికి రావణుని సైనికులు నిప్పంటించగా, ఆ విషయం చెప్పి రాక్షస స్త్రీలు సీతను భయపెట్టగా, సీతమ్మ అగ్నిదేవుని ఉపాసించినప్పుడు. జగజ్జనని తన ఆధ్యాత్మిక జ్వాలలను ఈ ఉపాసన ద్వారా సుస్పష్టంగా తెలిపింది. ఈ సర్గ పఠించేటప్పుడు నిజంగా రోమాంచకమనిపించింది. అప్పటి వరకు తామగ్ని వర్ణాం తపసా జ్వలంతీం అన్న రూపంలో రామధ్యానపరాయణయైన సీతమ్మ ఒక్కసారిగా తన ధర్మానుష్ఠానం ప్రకారం అగ్నిదేవుని ఉపాసించి హనుమంతునికి బాసటగా నిలిచింది.

ఇక ఆ తరువాత హనుమ కూడా మొత్తం లంక తగులబడినా అశోకవనంలో సీతమ్మ మాత్రం సురక్షితంగా ఉండటం చూసి విస్మయం చెంది, అగ్నిని అగ్ని దహించదు కదా అని తెలుసుకుని అమ్మకు నమస్కరించి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు.

గురువు గారు ఎప్పుడూ సీతమ్మ యొక్క వైభవాన్ని ఈ శ్లోకాల ప్రస్తావన చేస్తూ గుర్తు చేస్తారు. సీతామంత్రం నాకు శృంగేరి శారదాంబ సాక్షిగా అనుగ్రహించారు గురువు గారు. మంత్రంలో సుస్పష్టంగా సీతమ్మ ధ్యానమూర్తిగా, జగజ్జననిగా వర్ణించబడింది. అంత మహత్తరమైన మంత్రాన్ని అనుగ్రహించి నన్ను సుందరకాండతో అనుసంధానం చేసిన గురువు గారికి సదా కృతజ్ఞుడను. శ్రీగురుభ్యోనమః. సుందరకాండ 53వ సర్గలోని ఆ శ్లోకాలు, అర్థము.

ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనాం
యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః
యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః
యది కించనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః
యది వా భాగ్యశేషో మే శీతో భవ హనూమతః
యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమ లాలసామ్
న విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతః
యది మాం తారయేదార్యస్సుగ్రీవస్సత్యసఙ్గరః
అస్మాద్దుఃఖాంబుసంరోధాచ్ఛీతో భవ హనూమతః
తతస్తీక్ష్ణార్చిరవ్యగ్రః ప్రదక్షిణశిఖోऽనలః
జజ్జ్వాల మృగశాబాక్ష్యాశ్శంసన్నివ శివం కపేః

విశాలమైన నేత్రములు గల సీతాదేవి పరిశుద్ధమైన మనముతో అగ్నిహోత్రుని ఉపాసించినది. నేను పతి సేవ చేసియున్నదాననైతే, తపస్సు చేయుచ్చున్నదాననైతే, నాకు పాతివ్రత్యము కలిగియున్నచో హనుమంతునికి చల్లదనము కలుగు గాక. ధీమంతుడైన శ్రీరామునికి నాయందు కొంచెమైనా దయకలిగియుంటే, నేనిక మీదట కొంచెమైనా భాగ్యము పొందవలసియున్నచో హనుమంతునికి చల్లదనము కలుగుగాక. నేను పాతివ్రత్యము వదలనిదానని, రాముని పొందలేదని వగచుచున్నానని ధర్మాత్ముడగు రాముడు తలచియున్నచో హనుమంతునికి చల్లదనము కలుగుగాక. పూజ్యుడు, సత్యసంధుడగు సుగ్రీవుడు నాకిప్పుడు కలిగిన దుఃఖమును పోగొట్టగలిగినచో హనుమనుంతికి చల్లదనము కలుగు గాక. అంతట, హనుమంతుని తోకయందలి అగ్నిహోత్రుడు సీతకు హనుమంతునికి భయం లేదని తెలుపుచు అధికమైన ప్రదక్షిణ జ్వాలలతో జ్వలించెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి