29, జూన్ 2010, మంగళవారం

ఇందరికి అభయంబులిచ్చు చేయి - అన్నమాచార్యుల వారి కృతి




ఇందరికి అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి

వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగిలించినచేయి
వలనైన కొనగోళ్ళ వాది చేయి

తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి

పురసతుల మానములు పొల్లసేసినచేయి
తురగంబు బరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలాదీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి

సారాంశం:

అందరికీ అభయమిచ్చి రక్షించే ఆ చేయి ఎంతో సుందరమైన బంగారు చేయి. వెలకట్టలేని వేదాలను వెదికి తెచ్చిన మత్స్యావతారుని చేయి అదే. చిలికిన మందర పర్వతాన్ని కూర్మావతారంలో తన వీపుపై నిలిపిన చేయి అదే. సుందరియైన భూదేవిని వరాహావతారంలో కౌగిలించుకున్న చేయి అదే. వాడియైన గోళ్లతో హిరణ్యకశిపుని చీల్చిన నరసింహుని చేయి అదే. బలిచక్రవర్తి వద్ద తృప్తి తీరక మూడు అడుగుల నేలను దానంగా అడిగిన వామనుని చేయి అదే. పరశురామునిగా భూమిని జయించి దానమిచ్చిన చేయి అదే. శ్రీరామునిగా సముద్రుని దారికి తెచ్చేందుకు బాణాన్ని సంధించిన చేయి అదే. బలరామునిగా సాటిలేని నాగలిని ధరించిన చేయి అదే. శ్రీకృష్ణునిగా పురస్త్రీలైన గోపికల మానాన్ని తొలగించిన చేయి అదే. కల్కి అవతారంలో గుర్రాన్ని నడిపే మహత్తరమైన చేయి అదే. ఇలా దశావతారాలలో లోకరక్షణ చేసిన ఆ దివ్యహస్తమే వేంకటాచలానికి అధిపతియైన శ్రీవేంకటేశ్వరుని చేయిగా సమస్త ప్రాణులకు మోక్షమార్గాన్ని చూపుతున్నది.

అన్నమాచార్యుల వారి దశావతార కృతులలో ఇది ఒకటి. నిగూఢమైన పదాలు ఉపయోగించటంలో అన్నమాచార్యుల వారిది విలక్షణమైన శైలి. తిరుమల శ్రీనివాసుని వైభవం, మహిమలను ఆవిష్కరించటానికి దశావతారాలను ప్రాతిపదికగా చేశారు. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అనేక అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు, ధరమ్ము ఒక్క పాదములోనే ఉన్న కలియుగంలో తనను ఆశ్రయించిన వారికి మార్గము చూపించే దైవం అన్న సందేశానికి నమ్మకం కలిగించటానికి దశావతారాలను ప్రస్తావించారు. ఆ విధంగా పరమాత్మ తత్త్వాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి పాదముల చూపే హస్తమునకు ఆపాదించారు అన్నమయ్య. ఇక్కడ ముఖ్యమైన పదాలు - తనివోక, ఒనరంగ, మొనసి, పొల్లజేసిన, తెరువు. ఈ పదాలతో అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనకు అందజేశారు. మూడవ చరణం మొదటి పంక్తిని చాలామంది నరకాసురుని బారినుండి స్త్రీలను కాపాడినట్లుగా అర్థం చెప్పారు. కానీ పొల్లజేసిన అన్న పదాల అర్థం ఈ భావాన్ని స్ఫురించదు. అది గోపికల వస్త్రాపహరణ సందర్భానికే సముచితమని నా అభిప్రాయం.

ఈ సంకీర్తనలో అత్యంత ముఖ్యమైన విషయం ఆఖరి రెండు పంక్తులలో ఉంది - తిరుమలలో వెలసిన శ్రీనివాసుడు తనను శరణు కోరిన వారికి మార్గాన్ని చూపిస్తాడు అని. ఎలా? ఆయన కుడిచేయి పాదాలవైపు సూచిస్తుంది గమనించండి. అనగా మనకు ఆయన పాదాలే దారి. అనగా సర్వస్య శరణాగతితో ఆయనపై భారం వేస్తే ఆయనే అన్నీ చూసుకుంటాడు అని. ఇక్కడ సర్వస్య శరణాగతికి అనేక లక్షణాలు సాధకునికి ఉండాలి

మిశ్ర హరికాంభోజి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అహోబిలహరిని అర్చింతును - సాయికృష్ణ యాచేంద్ర గారి భక్తి గీతం

అహోబిలహరిని అర్చింతును నా అంతరంగమే అర్పింతును నరమృగప్రవృత్తులు ధరలో కలవని ఎరిగింప ఈ రూపు ధరియించిన భయావహం ఆ రూపం అయినా దయామయం హృదయం కన్నులలో...