23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ప్రతిభామూర్తి సింగీతం శ్రీనివాసరావు

ఆయన చిత్రాలు మూస మసాల ధోరణికి భిన్నంగా ఎంతో విలక్షణతతో, సాంకేతిక నైపుణ్యంతో, నటీనటుల ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకునే కోవకు చెందినవి. సంభాషణలు లేకుండా ఒక చిత్రానికి దర్శకత్వం వహించి దానిని విజయవంతం చేసిన సత్తా ఆయనలో ఉంది. ఒక్కొక్క చిత్రం ఒక్కో కోణంలో ఒక్కో సందేశంతో ఒక్కో నైపుణ్యంతో ఆయన తీర్చిదిద్దారు. హాలీవుడ్ స్థాయిలో చిత్రాలను ఆయన మనకు అందించారు. అదేనండీ, సింగీతం శ్రీనివాసరావు గారి గురించి చెబుతున్నా! ఈరోజు ఆయన 85వ పుట్టినరోజు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న ఆ ప్రతిభామూర్తి విశేషాలు కొన్ని.



ఆంధ్రప్రదేశ్‌లొని నెల్లూరు జిల్లా గూడురులో 1931, సెప్టెంబర్ 21న జన్మించిన శ్రీనివాసరావు గారు మద్రాసు విశ్వవిద్యాలయంలో చదువుకొని 1954లో కేవీ రెడ్డి గారి వద్ద మాయబజార్ చిత్రానికి అప్రెంటిస్‌గా చేరారు. సాంకేతిక కారణాల వలన మాయాబజార్ నిర్మాణం ఆలస్యం కావటంతో ఆయన కేవీ రెడ్డి గారి వద్దే దొంగరాముడు చిత్రంలో పనిచేశారు. అక్కడినుండి అద్భుతమైన ఆయన సినీప్రస్థానం మొదలైంది. పాటలు పాడటం, సాహిత్యం రాయటం, దర్శకత్వం, నిర్మించటం, నటన ఇలా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవీ రెడ్డి గారు, పింగళి నాగేంద్రరావు గారి శిష్యరికంలో ఆయన నైపుణ్యం సంపాదించారు. దొంగరాముడు చిత్రానికి ఆయన సహాయ దర్శకునిగా పనిచేసినా ఆయన పేరు టైటిల్స్‌లో వేయలేదు. అలాగే మాయాబజార్, జగదేకవీరుని కథ, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలలో కూడా పనిచేశారు. 1972లో మొట్టమొదటి సారి శ్రీనివాసరావు గారు స్వంతంగా నీతి నిజాయితీ అనే చిత్రం తీశారు. ఆ చిత్రం ఆడలేదు. 1974లో ఆయన తొలి తమిళ చిత్రం దిక్కత్ర పార్వతి అనే చిత్రానికి దర్శకతం వహించారు. రాజాజీ రచించిన ఓ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తమిళ చిత్రం అవార్డు పొందింది. నటిగా లక్ష్మికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. హిందీలో వచ్చిన సీష్‌మహల్ అనే చిత్రాన్ని 1975లో జమీందారు గారి అమ్మాయిగా నిర్మించారు. ఆచిత్రంలోని మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన అనే అద్భుతమైన పాట మనకు తెలిసిందే.

ఆయన సినీ ప్రస్థానంలో ముఖ్యమైన ఘట్టం 1976లో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రం. ఓ అమెరికా అమ్మాయి భారతీయ కళలపట్ల ఆకర్షించబడి ఇక్కడి మనుషులను ఎలా మారుస్తుందో ఈ చిత్రంలో సింగీతం వారు మనకు అద్భుతంగా తెరపై చూపించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అటుతరువాత వచ్చిన చిత్రాలన్నీ వైవిధ్య భరితమైనవి, విలక్షణమైనవి. పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, రామచిలక వంటి అద్భుతమైన తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే సమయంలో ఎన్నో తమిళ కన్నడ చిత్రాలను అందించారు. తరువాత మైలు రాయి 1984లో విడుడలైన మయూరి చిత్రం. ప్రఖ్యాత నర్తకి సుధా చంద్రన్ గారి నిజ జీవితం ఆధారంగా తీసిన చిత్రం ఉత్తమ చలన చిత్రం అవార్డు పొందింది. ఆయన దర్శకత్వంలో అమెరికాలో పుట్టిన ఓ అబ్బాయి నేపథ్యంలో చిత్రం 1987లో విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. తరువాత 1988లో వచ్చిన కళాఖండం పుష్పక విమాన. మాటలు లేకుండా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన చిత్రం ఇది. కమల్ హాసన్ గారి నట జీవితంలో ఈ చిత్రం ఓ కలికితురాయి. ఈ చిత్రానికి కూడా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి.  1989లో వచ్చిన మరో అద్భుత సృష్టి అపూర్వ సహోదరగళ్  (తెలుగులో అపూర్వ సహోదరులు). అన్ని భాషలలోనూ ఈ విజయం సాధించింది. కమల్ హాసన్ గారి నటనా కౌశలాన్ని శ్రీనివాస రావు గారు మరింత ఇనుమడింపజేసేలా మనకు ఈ చిత్రాన్ని అందించారు. గొప్ప సాంకేతిక విలువలతో విలక్షణమైన కథతో ఈ చిత్రం వారివురికీ ఎంతో పేరు తెచ్చింది.

1990లో శ్రీనివాసరావు గారు ఇంకో విలక్షణమైన హాస్యరస ప్రధాన చిత్రాన్ని మనకు అందించారు. అదే తమిళంలో తీసిన మైకెల్ మదన కామ రాజు అనే చిత్రం. కమల్ హాసన్ గారు నాలుగు పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓ అద్భుత కళావిష్కరణ. కమల్ హాసన్ గారి సినీ ప్రస్థానంలో మరో గొప్ప చిత్రం. మంచి విజయం సాధించింది. తెలుగు చలన చిత్ర చరితలో 1991 ఓ ముఖ్యమైన సంవత్సరం. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు కథానాయకుడుగా ఓ అద్భుతమైన చిత్రం విడుదలైంది. అదే ఆదిత్య 369. టైం మెషిన్ ద్వారా శ్రీకృష్ణదేవారాయల కాలానికి వెళ్లి మనకు ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని ఆయన తీశారు. ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. తరువాత బృందావనం, మేడం వంటి విలక్షణమైన చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి.

1994లో విడుదలైన మరో కళాఖండం భైరవ ద్వీపం చిత్రం. బాలకృష్ణ గారి సినీ విజయాలలో ఈ చిత్రం ఒకటి. జానపద ఇతివృత్తంలో మంచి కథతో జగదేకవీరుని కథను తలపించేలా శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. తరువాత కూడా ఎన్నో మంచి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2 జాతీయ అవార్డులు, 7 నంది అవార్డులు, 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 కర్ణాటక రాష్ట్ర అవార్డులు. అరవై రెండేళ్ల ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం మన సినీ ప్రపంచంలో ఓ మంచి అనుభూతి. దర్శకత్వ ప్రతిభ, సంభాషణలలో పటుత్వం, నిర్మాణంలో సాంకేతిక విలువలు, కథలో విలక్షణత, నటీనటుల ఉన్నతమైన నటనా కౌశలం, అద్భుతమైన ఛాయాగ్రహణం, మంచి సంగీతం ఆయన చిత్రాల ప్రత్యేకతలు. కమల్ హాసన్ గారి సినీజీవితపు విజయాలలో సింగీతం వారిది చాలా ముఖ్యమైన స్థానం.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించుకునే వ్యక్తిత్వం ఆయనది. ఆయన చిత్రాలు ముందు చూపుతో ఉంటాయి. కథలు దానిని సంపూర్ణంగా ప్రతిబింబిస్తాయి. ఆయన సినీయానంలో పుష్పక విమానానికి అత్యధికంగా ప్రజాదరణ రాగా, ఆదిత్య 369 ఆయనకు అన్నిటికన్నా తృప్తిని ఇచ్చిన చిత్రమట. 85ఏళ్ల వయసులో కూడ నేటి తరం దర్శకులకు పోటీగా చిత్రాలు తీయటానికి సిద్ధమంటున్న సింగీతం శ్రీనివాసరావు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో మరింత ఉత్సాహాన్ని కలిగించాలని నా ప్రార్థన.

అక్కిరాజు ప్రసాద్ (21/9/2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి