24, సెప్టెంబర్ 2016, శనివారం

మామ శకుని - ధూళిపాళ సీతారామశాస్త్రి గారు


మామ శకుని అనగానే మొదట సీఎస్సార్ తరువాత ధూళిపాళ గారి పేర్లు గుర్తుకోస్తాయి. ఒక లక్ష్యంతో కౌరవుల నాశనానికై ప్రతిజ్ఞ చేసిన శకుని పాత్రను ధూళిపాళ గారు ఎంతో బాగా పోషించారు. దాదాపు 40 ఏళ్ల సినీ నటజీవితంలో 300కు పైగా చిత్రాలలో నటించారు. ఆయన 95వ జయంతి ఈరోజు. ఆ సహజ నటునికి నివాళిగా ఈ వ్యాసం.

1921 సెప్టెంబర్ 24న ఇప్పటి గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామంలో (పల్నాడు ప్రాంతం) రత్నమ్మ మరియు శంకరయ్య దంపతులకు ధూళిపాళ సీతారామశాస్త్రి గారు జన్మించారు. 8వ తరగతి వరకు దాచేపల్లిలో చదువుకొని తరువాత బాపట్లలోని ప్రఖ్యాత శంకర విద్యాలయంలో వేదవిద్యను అభ్యసించారు. తొలుత ప్లీడరు గుమాస్తాగా పనిచేశారు. తరువాత స్త్రీ పాత్రల ద్వారా నాటక రంగ ప్రవేశం చేశారు. ఆయనకు నాటక రంగంలో బాగా పేరు తెచ్చిన పాత్ర దుర్యోధనుడు. ఆ కాలంలో మంచి నటుడు, రచయిత, గాయకుడు, దర్శకుడు అయిన గయుడు గారు ధూళిపాళ గారిని సినీ రంగానికి పరిచయం చేశారు. గయుడి గారి సహాయంతో 1962లో విడుదలైన భీష్మ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర ధూళిపాళ గారికి లభించింది. దుర్యోధనుడిగా ధూళిపాళ గారు తొలిచిత్రంలోనే అద్భుతంగా నటించారు. ఆ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

అదే సంవత్సరంలో పుండరకీక్షయ్య గారి నిర్మాణంలో కమలాకర కామేశ్వరరావు గారు మహామంత్రి తిమ్మరుసు చిత్రం విడుదల చేశారు. ఆ చిత్రంలో ధూళిపాళ గారు అల్లసాని పెద్దన పాత్ర వేసి మెప్పు పొందారు. ఇక తరువాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో బావ-బావమరది మధ్య యుద్ధానికి కారకుడైన గయిని పాత్రను వేశరు. సినిమాలో గయుడిగా ధూళిపాళ గారి పాత్రం చాలా ముఖ్యమైనదే. తరువాత వచ్చిన అద్భుతకళాఖండంలో ధూళిపాళ గారు తనకు పేరు తెచ్చిన పాత్ర వేసే అవకాశం వచ్చింది. లక్ష్మీ రాజ్యం గారు నిర్మాతగా కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలోనే 1963లో విడుదలై ప్రపంచమంతా పేరుపొంది తెలుగు సినీ స్వర్ణయుగంలో ఆణిముత్యం లాంటి చిత్రమైన నర్తనశాల (విరాట పర్వం) చిత్రంలో ధూళిపాళ గారు సుయోధనుడి పాత్ర వేశారు. దుర్లక్షణాలను తనం ముఖంలో అద్భుతంగా పండించి తన వంతు పాత్రను పరిపూర్ణంగా పోషించారు. కాకపోతే ఆ చిత్రంలో ఎస్వీఆర్, ఎన్‌టీఆర్, సావిత్రిల నటనా కౌశలం ముందు ఇంకెవ్వరూ నిలువలేకపోయారు. అఖండమైన విజయం సాధించి తెలుగు చలనచరిత్రలో కలికితురాయిగా నిలిచిన చిత్రం ఇది.

1964లో సీతారాం గారి దర్శకత్వంలో ఆయనే నిర్మాతగా విడుదలైన మరో మంచి చిత్రం బొబ్బిలి యుద్ధం. 18వ శతాబ్దంలో విజయనగరం క్షత్రియ గజపతి రాజులు మరియు బొబ్బిలి వెలమ రాజుల మధ్య జరిగే ఆధిపత్యపు పోరును తెరకెక్కించిన ఈ చిత్రంలో ధూళిపాళ గారు నరసరాయుడు పాత్రను పోషించారు. మళ్లీ పుండరీకాక్షయ్య/కమలాకర కామేశ్వరరావు గారి కాంబినేషన్‌లో 1967లో విడుదలైన శ్రీకృష్ణావతారం చిత్రంలో ధూళిపాళ గారు సత్రాజిత్తు పాత్రను పోషించారు. తరువాత ఉండమ్మా బొట్టు పెడతా, బాంధవ్యాలు, ఆత్మీయులు, ఏకవీర, బాలరాజు కథ, మట్టిలో మాణిక్యం, బాలభారతం, శ్రీరామాంజనేయ యుద్ధం, అందాలరాముడు, గుణవంతుడు, సీతాకళ్యాణం, మహాకవి క్షేత్రయ్య, కురుక్షేత్రం వంటి ఎన్నో చిత్రాలలో మంచి పాత్రలు పోషించారు.

ధూళిపాళ గారి నటజీవితంలో ముఖ్యమైన చిత్రాలు శ్రీకృష్ణ పాండవీయం (1966), బాలభారతం (1972), మరియు దాన వీర శూర కర్ణ (1977) చిత్రాలు. మూడింటిలోనూ ఆయన శకుని పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ కళ్లలో పగ, ప్రతీకార జ్వాల ప్రస్ఫుటంగా కనబరచారు. డైలాగ్స్‌లో కుటిల రాజనీతి హృద్యమైన తెలుగు భాషలో సుస్పష్టమైన ఉచ్చారణతో ఆయన చలనచిత్రాల వైభవాన్ని ఇనుమడింపజేశారు. ధూళిపాళ గారికి పేరు తెచ్చిన మరో పాత్ర సాంఘిక చిత్రమైన బాంధవ్యాలు. 1968లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎస్వీ రంగారావు గారు నిర్మించి దర్శకత్వం వహించారు, ప్రధాన పాత్ర కూడా అయానదే. ఆయన తమ్మునిగా ధూళిపాళ గొప్పగా నటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డును పొందారు. చిత్రం కూడా ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ధూళిపాళ గారి సినీ ప్రస్థానంలో చాలా మటుకు పాత్రలు పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలే. కమలాకర కామేశ్వరరావు గారే మళ్లీ 1977లో విడుదలైన కురుక్షేత్రం చిత్రంలో ఆయనకు ఇంద్రుని పాత్రను ఇచ్చారు. విఠలాచార్య గారి చిత్రాలలో కూడా ధూళిపాళ గారు మంచి పాత్రలు వేశారు.

గొప్ప హనుమద్భక్తులైన ధూళిపాళ గారు కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీర్వాదంతో 2001లో సన్యాసం స్వీకరించారు. గుంటూరులో మారుతి ఆశ్రమాన్ని స్థాపించారు. 2007 ఏప్రిల్ 13న సిద్ధి పొందారు. పల్నాటి పొరుషం తన భాషలో కనబరచే రంగస్థల నటుడు, స్ఫురద్రూపి, మంచి వాక్పటిమ, ప్రత్యేకమైన నటనా కౌశలం కలిగి ఉండటంతో పాటు భక్తుడు అయిన ధూళిపాళ సీతారామశాస్త్రి గారికి జోహార్లు.

-అక్కిరాజు ప్రసాద్ (24 సెప్టెంబర్ 2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి