23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నాటక కళాప్రపూర్ణ స్థానం నరసింహారావు గారు

అక్కిరాజు ప్రసాద్ (23/09/2016)
=========================


తెలుగు నాట రంగస్థల నటనకు, తరువాత సినీ నటనకు ఆద్యులైన వారిలో ఆయన ఒకరు. స్త్రీ పాత్రలకు ఆయన పెట్టింది పేరు. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్రకు రంగస్థలంలో పేరు తెచ్చింది ఆయన నటనా కౌశలమే. చింతామణి, దేవదేవి(విప్రనారాయణ), మధురవాణి (కన్యాశుల్కం) వంటి అద్భుతమైన పాత్రలను పోషించిన స్థానం నరసింహారావు గారి 114వ జయంతి నేడు. తొలితరం చిత్రాలలో కూడా నటించిన ఆయన 1500లకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు. 1902వ సంవత్సరం సెప్టెంబర్ 23న గుంటూరు జిల్లా బాపట్లలో ఆదెమ్మ, హనుమంతరావు దంపతులకు నరసింహారావు గారు జన్మించారు. బాపట్లలో భావనారాయణస్వామి వారి దేవస్థానం సమీపంలోనే ఉండేది వీరి ఇల్లు. 16వ ఏట తండ్రి మరణించగా స్థానం వారు తరువాత మేనమామ కామరాజు వేంకటనారాయణ గారి వద్ద పెరిగారు. ఆ మేనమామ కూతురు హనుమాయమ్మను స్థానం వారు వివాహం చేసుకున్నారు. వీరికి సావిత్రి అని ఒక కుమార్తె పుట్టింది.

బాపట్ల భావనారాయణస్వామి వారి గుడిలో భజనకు అలవాటు చేసుకున్న స్థానం వారు అక్కడే ఓ బాబా వద్ద ఊపిరిపై పట్టు సాధించి ఎక్కువ సేపు పాడగలిగే మెళకువ నేర్చుకున్నారు. మేనమామ బాపట్లలోనే ప్లీడరుగా చేసేవారు. ఆయన సహాయంతో నాటకాల రిహార్సల్స్ చేసుకునే వసతి కలిగింది. బాపట్లలో చదుకువుకునేటప్పుడే ఆయన చిత్రలేఖనం నేర్చుకున్నారు. ఈ చిత్రకళానైపుణ్యం, భజనల అనుభవం, మేనమామ ఇంట్లో హార్మోనియంతో సాధన ఆయన నాటక రంగ ప్రస్థానానికి మూలస్థంభాలైనాయి. భావనారాయణ స్వామి వారి గుడిలో జరిగే బుర్రకథలు, కూచిపూడి యక్షగానాలు, భామా కలాపాలు ఆయనపై ఎంతో ప్రభావం చూపాయి. అభినవ సత్యభామగా పేరొందిన వెంపటి వెంకటనారాయణ గారి నటన ఆయనను ప్రభావితం చేసింది.

1920లో నాటక రంగం ప్రవేశించిన ఆయనకు త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి అనే నటుడు శిక్షణనిచ్చారు. తెనాలిలోని రామ విలాస సభ ద్వారా ఆయన రంగ ప్రవేశం జరిగింది. స్థానం వారి మొట్టమొదటి రంగస్థల పాత్ర సత్యహరిశ్చంద్రలో చంద్రమతి. 1921వ సంవత్సరంలో ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఆయన నటనకు ముగ్ధులైన చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి గారు స్థానం వారి వద్దకు వచ్చి మరీ ఆశీర్వదించారుట. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి కార్యక్రమాల సహాయానికి చీరాలలో ఈ నాటకాన్ని మరల వేయాలని కోరగా తల్లి ముందు అంగీకరించలేదు. తరువాత ఊరిపెద్దల ఒత్తిడితో ఆవిడ ఒప్పుకోక తప్పలేదు. ఆ ప్రదర్శనకు ఆయనకు పది రూపాయల పారితోషకం లభించింది. తరువాత అదే నాటకాన్ని గుంటూరు, వేటపాలంలలో ప్రదర్శించారు.

తరువాత ఆయనకు పేరు తెచ్చిన పాత్ర రోషనారా. ఔరంగజేబు చెల్లెలైన రోషనార కథను కొప్పరపు సుబ్బారావు గారు నాటకంగా రచించగా ఆ పాత్రను స్థానం వారు పోషించి లబ్దప్రతిష్ఠులైనారు. తరువాత తెనాలిలోని మూడు ప్రఖ్యాత నాటక సంస్థల ద్వారా ఎన్నో నాటకాలు వేశారు. ఆయనకు పేరు తెచ్చిన ఇతర పాత్రలు భక్త ప్రహ్లాదలోని లీలావతి, శ్రీకృష్ణ లీలలులో యశోద, మోహినీ రుక్మాంగదలో మోహిని పాత్రలు. రామ విలాస సభ ద్వారా రోషనార, సోహ్రాబ్ అండ్ రుస్తుం, అభిజ్ఞాన శాకుంతలం, కన్యాశుల్కం, సతీ అనసూయ, చింతామణి, సారంగధర, చంద్రగుప్తలో ముర, బొబ్బిలియుద్ధంలో మల్లమదేవి, చండికలో చండిక వంటి ఎన్నో నాటకాలలో ఆయన పాత్రలు ధరించారు.

ఆయన హావభావాలు, హొయలు, చిలిపి నవ్వులు, శృంగార రసావిష్కరణలు ఆనాటి రంగస్థల రసికుల మనసులను ఉర్రూతలూగించాయి. ఆయన పాటలు ప్రేక్షకుల మనసులను దోచుకునేవి. స్త్రీ పాత్రలను ధరించటంలో వేషభూషలు, నడవడికలు, మాటలపై ఆయన అత్యంత శ్రద్ధతో సిద్ధమయ్యేవారు. ప్రేమ తరువాత ప్రతీకారం కనబరచే రోషనారా పాత్రా ఆనాడు తెలుగునాట అందరి నోట మెలిగింది. సత్యభామగా, చిత్రాంగిగా, శకుంతలగా ఆయన అభినయం అనుపమానం.

స్థాణం వారి రంగస్థల జీవితంలో కలికితురాయి సత్యభామ పాత్ర. ఆయన శ్రీకృష్ణ తులాభారంలోని ఈ పాత్రకోసం భీమవరపు నరసింహారావు గారి సహకారంతో మీరజాల గలడా అనే ప్రఖ్యత గీతాన్ని రచించారు. ఈ నాటకం, పద్యంతో ఆయన తెలుగు నాటక చరిత్రలో కొత్త యుగాన్ని ఆరంభించారు. పాటనుండి పద్యానికి పద్యం నుండి పాటకు మారుతూ గంటల తరబడి పాడుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశరు. పద్యగద్యాల సమన్వయంతో కొత్త పంథాను సృష్టించారు. తెనాలి నుండి ఆయన ప్రస్థానం శ్రీకృష్ణ తులాభారం ద్వారా చెన్నైకి సాగింది. 1928లో ఈ ప్రదర్శన జరిగింది. తరువాత బెంగుళూరులో వరుసన 22 ప్రదర్శనలు ఇచ్చి ప్రఖ్యాత రంగస్థల కళాకారులు గుబ్బి వీరన్న గారి ప్రశంసలు కూడా పొందారు. ఆయన సత్యభామ పాత్రకు కాశీనాథుని నాగేశ్వరరావు గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి నాయకులు ముగ్ధులై ఎంతో ప్రశంసించారు.

బళ్లారి రాఘవ, బందా కనకలింగేశ్వరరావు, వేమూరి గగ్గయ్య, ఈలపాట రఘురామయ్య వంటి మేటి రంగస్థల నటులకు సమకాలీకులు స్థానం వారు. ఆకాశవాణిలో కన్యాశుల్కం మరియు గణపతి వంటి నాటకాలతో ప్రజలను అలరించారు. రాధాకృష్ణ, సత్యభామ అనే తొలితరం చిత్రాలలో నటించారు. నటస్థానం అనే పుస్తకాన్ని రచించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 1956లో పద్మశ్రీ అవార్డు, 1961లో సంగీత నాటక అకాడెమీ అవార్డు వచ్చాయి. ఆయనకు నరసాపురంలో నటకావతంస బిరుదు (1924), కలకత్తా మేయర్ బంగారు పతకం (1932), రంగూనులో స్వర్ణ కిరీట ధారణ (1933), విజయనగరంలో నటశేఖర బిరుదు (1953), న్యూఢిల్లీలో డాక్టర్ రాధాకృష్ణన్ గారి అభినందన (1954), నాటక కళాప్రపూర్ణ బిరుదు (1960) లభించాయి. ఆయన నాటక కళాపరిషత్తుకు అధ్యక్షత కూడా వహించారు. 1957లో ఆకాశవాణిలో చేరి నాటక కార్యక్రమాల ప్రయోక్తగా పదేళ్లు పనిచేశారు. పక్షవాతంతో ఏడాదిపాటు మంచాన పడి 1971 ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన తెనాలిలో ఆయన పరమపదించారు.

ప్రముఖ ఆచార్యులు డాక్టర్ మొదలి నాగభూషణ శర్మ గారు స్థానం వారి గురించి "నటకావతంస స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం" అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తక ఆధారంగా ఈ వ్యాసం రచించబడింది.

స్థానంవారు పాడిన మీరజాల గలడా నాయానతి
https://www.youtube.com/watch?v=-mVLrCRnjSc

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి