9, మార్చి 2016, బుధవారం

సీతారామ వైభవం-4: ఇక్ష్వాకు-నిమి వంశజుల వివరాలు



సాధారణంగా పెళ్లి అనుకోగానే కుటుంబాల వివరాలు తెలుసుకుంటాము. ఇది మనకు సనాతన ధర్మం నుండి వచ్చిందే. శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు తన మంత్రులను పంపించి దశరథ మహారాజును మిథిలకు ఆహ్వానిస్తాడు. దశరథుడు సంతోషించి వశిష్ఠాదులతో మిథిల చేరుకుంటాడు. జనకుడితో తన వంశవృత్తాంతాన్ని వశిష్ఠుల వారు తెలుపుతారు అని అంటాడు. వశిష్ఠుడు ఇలా వివరంగా ఇక్ష్వాకు వంశ వివరాలు తెలుపుతాడు:

"ఓ జనక మహారాజా! అవ్యక్తమైన పరబ్రహ్మమునుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆయనకు మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపునికి సూర్యుడు జన్మించాడు. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఇతడు మొదటి ప్రజాపతి. ఇతని కుమారుడు ఇక్ష్వాకువు. ఈయన అయోధ్యకు మొదటి ప్రభువు. కుక్షి అనేవాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతని కుమారుడు వికుక్షి. అతని కుమారుడు బాణుడు. మహాపరాక్రమశాలి అనరణ్యుడు బాణుని కుమారుడు. అతని కొడుకు పృథువు. పృథువు కొడుకు త్రిశంకువు. అతని కుమారుడు దుందుమారుడు. అతని కుమారుడు యువనాశ్వుడు. అతని కుమారుడు మాంధాత. అతని కుమారుడు సుసంధి. సుసంధి కుమారులు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. అసితుడు భరతుని కుమారుడు. అసితుని కుమారుడు సగరుడు. సగరుని కుమారుడు అసమంజుడు. అతని కుమారుడు అంశుమంతుడు. ఆయన కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆయన కుమారుడు కకుత్‌స్థుడు. అతని కుమారుడు రఘుమహారాజు. అతని కుమారుడు ప్రవృద్ధుడు. అతని కుమారుడు శంఖణుడు. అతని కుమారుడు సుదర్శనుడు. అతని పుత్రుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శీఘ్రగుడు. అతని కుమారుడు మరువు. అతని కుమారుడు ప్రశుక్రుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. ఆయన కుమారుడు నహుషుడు. నహుషుని కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. ఆయన తనయుడు అజుడు. అజుని కుమారుడే దశరథుడు. ఇక్ష్వాకు వంశము మొదటినుండీ అతి పవిత్రమైనది. ఆ వంశములో పుట్టిన రాజులందరూ మహాధార్మికులు, వీరులు,సత్యసంధులు. ఓ రాజా! ఆ మహావంశసంజాతులైన రామలక్ష్మణులకు మీ కుమార్తెలను ఇచ్చి వివాహము చేయుట ఎంతో యుక్తము. వంశవైభవము వలన, సద్గుణసౌశీల్యముల వలన, ఈడు-జోడు బట్టి కూడా ఈ రాజకుమారులు మీ కుమార్తెలు వివాహమాడుటకు తగిన వారు" అని చెబుతాడు.

అప్పుడు జనకుడు మంగళ వచనాలు పలికి వశిష్ఠునికి ఇలా వివరాలు చెబుతాడు. "మహర్షీ మా వంశం కూడా చాలా గొప్పది. కన్యాదాత వివాహ సమయంలో వంశవృత్తాంతాన్ని పూర్తిగా వివరించటం సమంజసం. మా వంశానికి మూల పురుషుడు నిమి మహారాజు. ఆయన ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన వాడు. ఎంతో ధర్మాత్ముడు. అతని కుమారుడు మిథి. అతడే మిథిలా నగర నిర్మాత. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని కుమారుడు నందివర్ధనుడు. అతని సుతుడు సుకేతుడు. అతని కుమారుడు దేవరాతుడు. ఆయన పుత్రుడు బృహద్రథుడు. ఆయన కుమారుడు మహావీరుడు. అతని కుమారుడు సుధృతి. అతని తనయుడు దృష్టకేతువు. అతని తనయుడు హర్యశ్వుడు. వీరందరూ ధర్మపరాయణులు. హర్యశ్వుని కుమారుడు మరువు.  అతని పుత్రుడు ప్రతింధకుడు. అతని సుతుడు కీర్తిరథ మహారాజు. అతని తనయుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు.  ఆతని తనయుడు మహీధ్రకుడు. కీర్తిరాతుడు అతని కుమారుడు. అతని పుత్రుడు మహారోముడు. అతని తనయుడు స్వర్ణరోముడు. అతని పుత్రుడు హ్రస్వరోముడు. వీరందరూ రాజర్షులే. హ్రస్వరోముని కుమారులలో పెద్దవాడిని నేను. నా తమ్ముడు కుశధ్వజుడు మహావీరుడు. మా తండ్రిగారు జ్యేష్ఠుడనైన నన్ను రాజుగా చేశాడు. కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. ఓ మునీశ్వరా!  చాలా సంతోషముగా నేను నా కుమార్తెలలో సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహం చేసెదను. ఓ దశరథ మహారాజా! నేను ఈ విషయం మూడు మార్లు చెబుతున్నాను. ఇందులో సందేహము లేదు. రామలక్ష్మణులచే స్నాతకము చేయించుము. నీకు శుభము కలుగు గాక. వివాహానికి సంబంధించిన నాందీవిధులను నిర్వహింపుము. ఉత్తర ఫల్గుణీ నక్షత్రమున వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు సుఖశాంతులు కలగటానికి దానాలు ఇప్పింపుము" అని పలుకుతాడు.

అపుడు విశ్వామిత్రుడు జనకునితో "రాజా! నీ తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలు మాండవి శ్రుతకీర్తి  అనుపమానమైన సౌందర్యవతులు. మాండవిని భరతునకిచ్చి, శ్రుతకీర్తిని శతృఘ్నునికిచ్చి వివాహము చేయుట యుక్తము" అని పలుకుతాడు. దశరథుడు, జనకుడు అందుకు వెంటనే సంతోషించి అంగీకరిస్తారు.

వివరణ:

వివాహానికి కేవలం అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడటంతో సరిపోదు, వివరాలు తెలుసుకొని ఆ వంశస్థుల వివరాలు కూడా ముఖ్యం. ఎందుకంటే, ఒక సంసారం హాయిగా సాగటానికి కుటుంబాలలో పాటించే పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు తెలుసుకొని ఆ జంట అన్యోన్యంగా ఉండటానికి దోహదపడతాయి. అలాగే ఆయా వంశాలలో గొప్పవారి వివరాలు తెలుసుకోవటం ద్వారా వియ్యాలవారిని సముచితంగా గౌరవించే అవకాశముంటుంది.

ఇక్కడ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వారందరూ మహావీరులుగా, ధర్మపరాయణులుగా చెప్పబడ్డారు. అలాగే, జనకుని పూర్వజులందరూ రాజర్షులే. రాజ్యపాలనతో పాటు ధర్మసూక్ష్మాలు పాటిస్తూ, యజ్ఞ యాగాది క్రతువులు చేసి దివ్యశక్తులు పొందిన వారు. రెండు పవిత్రమైన వంశాల కలయిక సీతారాముల వివాహం. దానికి నాంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణకై తీసుకువెళ్లటం. మన పురాణాలలోని గొప్పతనం ఇదే. రాజులకు ఋషులు, మహర్షులు, యోగులు ఎప్పటికప్పుడు ధర్మాన్ని బోధించి లోకకళ్యాణార్థం సముచిత కార్యాలు చేయించే వారు. దీనివలన రాజులకు యశస్సు, రాజ్యానికి సుఖశాంతులు, ఋషులకు సత్కర్మ ఫలం దక్కేది. వశిష్ఠాదులు ఇక్ష్వాకు వంశాన్ని ఇలా కంటికి రెప్పలా కాపాడగా శతానందుడు మొదలైన వారు జనకుని వంశాన్ని ఉద్ధరించారు. వివాహమనేది ఒక పవిత్రమైన కార్యం. దాని వలన రెండు వైపులా  తరాలు ఉద్ధరించబడతాయి. లోకోద్ధరణకు బీజం పడుతుంది. అందుకే మన వివాహ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది, సనాతనమైనా పుష్టికరమైనది. 

1 కామెంట్‌: