27, ఫిబ్రవరి 2016, శనివారం

తొలిరేయి గీతాలు - హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి (వెలుగునీడలు)


తొలివలపులో చంద్రుడు, చల్లదనం, పరువాలు, పరవశం, కోరికలు, చిలిపితనం, మైమరపు ఎన్ని భావనలో. గడచిన తరంలో భార్యా భర్తల మధ్య అనురాగాన్ని చాలా లలితంగా చలన చిత్రాలలో అందించేవారు. ఈరోజుల్లా దాష్టీకం, ఎగరడాలు, దూకడాలు, తొడలు కొట్టడాలు మొదలైన ఆవేశపూరితమైన లక్షణాలను చూపించేవారు కాదు. హాయిగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా, లాలనగా ఆ బంధాలను చిత్రీకరించేవారు. ఆ భార్యా భర్తల తొలిరేయి ఎంత మధురంగా ఉంటుందో తెలియజేయటానికి వెలుగునీడలు చిత్రంలోని "హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి" పాట మరో మంచి ఉదాహరణ. కథలో పరిస్థితుల కారణంగా ప్రధాన పాత్ర అయిన నాయికను కాకుండా ఇంకొకరిని వివాహం చేసుకున్న నాయకుడు ఆమె పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించి తొలిరేయిని ఎంత మధురంగా భావించాడో ఈ గీతంలో తెలుస్తుంది. తొలిరేయి గీతాలు శీర్షికన ఆఖరి సంచికగా "హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి" గీతం వివరాలు మీకు అందిస్తున్నాను.

హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి 
మందు జల్లి నవ్వ సాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వ సాగే ఎందుకో

తళతళ మెరిసిన తారక
చెలి వెలుగుల వెన్నెల దారుల
కోరి పిలిచెను తన దరి చేరగ
మది కలచెను తీయని కోరిక

మిల మిల వెలిగే నీటిలో
చెలి కలువల రాణి చూపులో
సుమ దళములు పూచిన తోటలో
తొలి వలపుల తేనెలు రాలెను

విరిసిన హృదయమే వీణగా
మధు రసముల కొసరిన వేళల
తొలి పరువములొలికెడు సోయగం
కని పరవశమందెను మానసం

శ్రీశ్రీ గారు తొలిరేయం గీతం రాశారా అని ఆశ్చర్యపోతున్నారా? నేను కూడా అవాక్కయ్యాను. ఆయన విప్లవ రచయితగా అందరికీ తెలుసు, అక్కడక్కడ భక్తి గీతాలు రాశారు అని తెలుసు, కానీ ఇలాంటి తొలిరేయి గీతం కూడా రాశారని తెలిసి వారి ప్రజ్ఞకు జోహార్లు తెలిపాను. ఆయనలోని ప్రతిభా జ్యోతి ఎంత దేదీప్యమానంగా వెలిగిందో ఆయన రాసిన విలక్షణమైన గీతాలు పరిశీలిస్తే తెలుస్తుంది. వాటిలో ఒకటి ఈ హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి అనే గీతం. చంద్రుడిపై ఎందరో మహానుభావులు భావుకంగా రాశారు. కానీ, ఈ శ్రీశ్రీ గీతానికి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రుడు ఈ జంట తొలిరేయి నాడు వెండి దారాలల్లి మత్తు మందు చల్లి నవ్వుతున్నాడు అని ఆయన గీతాన్ని ఆరంభించటం. వెండి దారాలల్లి అంటే ఆ వెన్నెలను దారులుగా వేసి తారలను ఆహ్వానిస్తున్నాడు అని కవి భావమేమో అనిపించింది. వెన్నెల వెలుగుల దారిలో మెరుస్తున్న తారక తన దరికి చేరమని కోరి పిలిచిందిట, తీయని కోరిక మదిని కలచిందట. భార్య తారకగా, ప్రియుడు చంద్రునిగా ఎంత అద్భుతంగా వర్ణించారో శ్రీశ్రీ గారు. వెన్నెలలో మెరుస్తున్న నీటిలో కలువల చూపులలో రెక్కలు విప్పి పూచిన పూదోటలో తొలి వలపులనే తేనెలు రాలాయిట. చంద్రుని చల్లదనానికి విరిసే కలువలు ప్రేయసీ ప్రియుల మధ్య విరిసే వలపులకు ప్రతీక. దీన్నే కవి మనకు చక్కని చిక్కని తెలుగులో అందించారు. వలపులతో హృదయం వీణగా మ్రోగి తీయని రసాలని ఒలికిస్తే, ఆ తొలి పరువాల సొగసు చూసి మనసు పరవశించిందట. నాయికానాయకుల మనోభావనను అద్భుతంగా పలికించారు శ్రీశ్రీ.

వెలుగునీడలు చిత్రంలో సావిత్రి కద నాయిక? మరి ఈ పాటలో గిరిజగారున్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానం మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అయినా కూడా, దర్శకులు సందర్భోచితంగా భార్యాభర్తలపై ఈ గీతాన్ని పొందుపరచారు. ఒకరకంగా గిరిజ గారి సినీ ప్రస్థానంలో వెలుగునీడలలోని ఈ పాట ఒక గొప్ప మైలురాయి అని చెప్పుకోవాలి. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం ప్రతిభ ఈ చిత్రం మొత్తం కనబడుతుంది. ఈ పాట చిత్రీకరణలో జాబిల్లి, వెన్నెల, భార్యాభర్తల మనోభావాలు నటనలో చూపించటం...వీటన్నిటా వారు గుర్తుకొస్తారు. పెండ్యాల వారి సంగీతంలో ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ పాడిన ఈ గీతం ఎంతో పెరు తెచ్చుకొంది. పాట వినగానే ఏఎన్నార్ గారు నాయకులు అనేలా ఘంటసాల మాష్టారు పాడారు. అందరు ప్రతిభావంతుల చేత రూపకల్పన చేయబడటం వలననే తొలిరేయి గీతాలలో ఇది మంచి స్థానాన్ని నిలుపుకుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి