5, సెప్టెంబర్ 2015, శనివారం

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే - చైతన్య మహా ప్రభు


పెద్ద రెండంతస్థుల మందిరము, విశాలమైన కిటికీలగుండా అస్తమించే సూర్యుని కిరణాలు భవ్యమైన కృష్ణుని విగ్రహం పాదాలు తాకి స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుతున్నాయి. సాయంసేవలో పూజారి నిమగ్నుడైనాడు.  విగ్రహానికిరు ప్రక్కలా నిలువెత్తు ఇత్తడి దీపాల ప్రకాశం, మట్టి ప్రమిదెల దీపాలతో దేవాలయ లోగిలి, ఆవరణ వెలిగిపోతోంది. ఘంటానాదం శ్రావ్యంగా ఆ పరిసరాలంతా మారు మ్రోగిపోతోంది. మందిరపు ద్వారాలు మూసి ఉన్నాయి.

ఒక చిన్నబాలుడు పంచెకట్టి, నామములు ధరించి కృష్ణ భక్తిలో మైమరచి భగవంతుని మూర్తి చూడాలన్న ఆత్రంతో దేవాలయం కిటికీలోంచి తొంగి చూశాడు. ఆశ్చర్యం! పూజారి రూపంలోనే ఇంకొక మహాతేజస్సు గల వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి, నామములు పెట్టుకొని, అహంకార రాహిత్యానికి సూచికగా శిరస్సు మరియు ముఖముపై వెంట్రుక లేకుండా గీయించుకొని, మెడలో పూల మాల, చేతిలో చిరుతలు, కాలికి గజ్జెలు కట్టి పరవశంలో నర్తిస్తున్నాడు. జయ కృష్ణ కృష్ణ కృష్ణ హరే అని శ్రావ్యంగా ఆలపిస్తున్నాడు. ఇంతలో స్వామి విగ్రహానికి కిరుప్రక్కలా మరిద్దరు అదే రూపము గల దివ్యస్వరూపులు వెలసి స్వామికి వింజామరలు వీయటం మొదలు పెట్టారు. ఆశ్చర్యం! మరుక్షణం స్వామి ఎదుట అదే రూపం గల మరో భక్తుడు పంచహారతులిస్తూ ప్రత్యక్షమైనాడు. ఇలా ఐదు నిమిషాల సమయంలో దేవాలయ ప్రాంగణమంతా ఒకే రూపం గల భక్తుల సమూహంతో నిండిపోయింది.

వారందరూ అరమోడ్పు కనులతో, కనుల స్వామి రూపాన్ని నింపుకొని, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఒకే లయలో శృతిలో రాగంలో ప్రభువును కొలుస్తూ నర్తిస్తున్నారు. వ్యత్యస్త పాదలయతో హరే కృష్ణా హరే కృష్ణా అని, జయ రాధా మాధవా జయ కుంజ బిహారీ అని అనేక విధాల స్వామిని అనర్గళంగా నుతిస్తున్నారు. మందిరమంతా దివ్య నాదంతో, వారి వారి భక్తి ప్రేరితమై ప్రభువు యొక్క శక్తి ప్రచోదనమై అణువణువు దివ్యత్వంతో నిండింది. అలా ఎన్ని గంటలు సాగిందో తెలియదు...మిగిలిన రూపాలన్నీ మాయమైనాయి. ఒక్క దివ్య మంగళ రూపం మాత్రం ధ్యాన స్థితిలో ప్రభువు ముందు నిశ్చలమై నిలిచి ఉంది. అతనే చైతన్య మహా ప్రభు. కృష్ణ భక్తిని భరత భూమిలో దశదిసల వెదజల్లిన మహానుభావుడు.

కడలి అంత ప్రాశాంతత, దివ్య సుందర రూపం, మెరిసే బంగారు మేని ఛాయ, ప్రేమ, కరుణలు నిండిన కన్నులు, అడుగు వేసిన చోటల్లా ఎర్రని కలువలు వెలుస్తాయన్నంత శ్రీచరణాలు, మోక్షాన్ని సూచించే తెల్లని ఊర్ధ్వ పుండ్రము, భుజములపై శంఖ చక్రముల సమాశ్రయణము ...చూసే వారికి వెంటనే ఆరాధనా భావం కలిగే మంగళ రూపం ఆ చైతన్య ప్రభువుది.

చైతన్య ప్రభువు శిష్య బృందంతో నృత్యం చేస్తూ తన నివాసమునుండి బయటకు అడుగుపెట్టి పురీ నగర వీధులలో ఆ జగన్నాథుని హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మంత్రాన్ని పాడుతూ వెళుతున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు నెమ్మ నెమ్మదిగా కృష్ణమంత్రాన్ని పఠిస్తూ ఆయనతో పాటు వీధులలో సాగారు. పది మంది కాస్తా వేయి మంది అయినారు. ఊరు ఊరంతా కదలింది. పురీ నగరమంతా కృష్ణ నామ స్మరణతో మారుమ్రోగింది...

జగన్నాథుని భవ్యమైన మందిరాన్ని సమీపిస్తోంది ఈ భక్త ప్రవాహం. పారవశ్యంలో ఎక్కడికి వెళుతున్నామో బాహ్య ప్రపంచాన్ని మరచి నర్తిస్తూ నుతిస్తోంది ఆ వాహిని. జగన్నాథుని ముఖ్యద్వారం ముందుకు వచ్చింది ఆ భక్తసాగరం. ఆశ్చర్యం. ఒక్కసారిగా మందిరమంతా దీపాలతో వెలిగిపోయింది. ఘంట దానంతట అదే శ్రావ్యమైన లయలో మ్రోగ సాగింది. మందిరమంతా కృష్ణ నామ స్మరణతో నిండిపోయింది. అక్కడ ఉన్న భక్తులందరూ బాహ్య ప్రపంచాన్ని మరచి ప్రభు నామస్మరణలో తేలియాడారు. చైతన్యప్రభువు బృందం మందిరంలో ప్రవేశించింది...అవధులు లేని ఆనందం, ఉత్సాహంతో నృత్యం, ఎదురుగా బలభద్ర సుభద్రా సమేతుడైన జగన్నాథుడు. ఈ భక్త సమూహంతో చైతన్య ప్రభువు ఆ లోకేశ్వరుని కొలుస్తున్నారు. మందిర ప్రాంగణమంతా కృష్ణనామే. రాత్రంతా జరుగుతూనే ఉంది..మందిరం మూయలేదు, ప్రభువు మేల్కొనే ఉన్నాడు...

ఈ ఆనందహేలలో జగన్నాథుడు కూడా చేరాడు. తన అష్టభార్యలతో దిగి వచ్చి ఆ లయబధ్ధమైన నృత్యగాన హేలలో పాల్గొన్నాడు. జగన్నాథ దేవాలయం బృందావనంగా మారింది. పూలు వికసించాయి, తరులు ఉప్పొంగాయి. పక్షులు ఆలపించాయి. పశుపక్షి గణం ఆనందకేళిలో మునిగిపోయాయి. పసిపిల్లలు, స్త్రీ పురుషులు మైమరచి కృష్ణునితో నర్తించారు. ఎంత సమయం గడిచిందో తెలియదు. ఆకలిదప్పులు లేవు, నిద్రాహారాలు లేవు భక్తులకు. తెల్లవారబోతోంది. జగన్నాథుడు తన స్వస్థానానికి చేరుకున్నాడు. భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆశ్చర్యం! వారికి మెలకువ వచ్చేసరికి చేతిలో వెన్నముద్ద, వారి వారి శరీరంలోని అనారోగ్యాలు అన్నీ తొలగి పోయాయి. కుష్ఠు వ్యాధి గలవాడు పరమ తేజస్సు గల శరీరంతో స్వాస్థుడైనాడు. క్షయ వ్యాధి ఉన్నవానికి దగ్గు మాటేలేదు, అవిటివానికి కాళ్లు వచ్చాయి, కళ్లు లేని వానికి కళ్లు వచ్చాయి...అందరూ ఆనందబాష్పాలతో జగన్నాథుని మందిరంలోకి పరుగెత్తి వెళ్ళారు. ప్రభువు ముంగిట చైతన్య ప్రభువు ధ్యానమగ్నుడై ఉన్నాడు. శ్రీకృష్ణుని రూపంలో జగన్నాథుడు చైతన్య ప్రభువు ఎదుట నిలిచాడు. ఆ పరమాత్మ రూపం అలానే ఉంది, ఈ ప్రభువు హృదయస్థానంలో కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మరో జగన్నాథుడు సూక్ష్మరూపంలో.

ఆ ప్రభువు ఈ ప్రభువు మధ్య తేడా తెలియకున్నది. అదే తేజస్సు, అదే మందహాసము, అదే ప్రశాంతత, అదే నిర్మోహము, అదే కృపా వీక్షణము...తామెవరో మరచిన భక్తులకు జగన్నాథుని ఏకరూపం అనేకములుగా కనిపించింది. వారు తారతమ్య భేదం లేకుండా నేను భావనను వీడి కృష్ణగానం చేశారు....తరించారు...పురీ నగరం పరిశుద్ధమైంది. అందరూ జీవాత్మను పరమాత్మతో అనుసంధనం చేసుకున్నారు. మోక్షం పొందారు.

చైతన్య ప్రభువు మొదలుపెట్టిన ఈ కృష్ణ నామస్మరణ మహాయజ్ఞం అలా గంగా ప్రవాహంలా నిరాటంకంగా కొనసాగుతునే ఉంది. కృష్ణ తత్త్వం జగద్విదితమయ్యింది. ఎందరో చైతన్య ప్రభువు లాంటి భక్తులు జన్మించి తరించారు. భరతజాతి కృష్ణుని భక్తిలో ముక్తి పొందుతునే ఉంది.

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే  రామ రామ  రామ హరే హరే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి