23, సెప్టెంబర్ 2015, బుధవారం

అర్ధనారీశ్వరం


అందమైన ఆమె కాలి గజ్జెల చప్పుడు దగ్గరవుతున్న కొద్దీ గుండె వేగంగా కొట్టుకుంటోంది. మెల్ల మెల్లగా ఆ రవం పెరుగుతోంది. ఆమె తలలోని సంపెంగ పూవు సువాసనలు వలపుల అలలను రేపుతున్నాయి. గజ్జెల చప్పుడు నెమ్మదించింది. తన స్వప్న సుందరి మాయమైందా అని అతడు తల ఎత్తి చూశాడు. ఎదురుగా ఎవ్వరూ లేరు. పక్కకు తిరిగి చూశాడు. నిరాశా చెందాడు. ఆ కావ్య కన్యక కానరాలేదు. దిగాలుగా తలదించుకొని తన కలంపై దృష్టి పెట్టాడు.

మలయమారుతములు వీచినట్లు వీచి నా మనసును దోచుకున్న ఓ యెంకి!
కలభగమనమున వచ్చినట్లు వచ్చి నా ఎడదన నిలిచిన ఓ సఖి!
నీ గాఢపరిష్వంగనమున రమించి ఆత్మానందమునొందాలని తపించితి
నీ వలపుల చూపుల పరవశించి నన్ను నేను మరవ ఆశించితి
ఏల ఈ విరహ పరీక్ష నాకు? ఎందుకీ కలహ ప్రణయము నాతో?

అని తెల్లని కాగితంపై కావ్యకన్యక రూపం పక్కనే చక చక అక్షర మాలను వ్రాసాడు. వెనకనుండి ఫక్కున నవ్వు వినపడింది. ఎవరా అని ఆ రసికుడు వెనుదిరిగి చూశాడు. జలపాతంలో నీళ్లలా గల గల నవ్వులు కురిపిస్తోంది...అరవిరిసిన కురులు, చారడేసి కలువరేకుల్లాంటి కళ్లు, నల్లని కాటుక, కళ్లలో చిలిపి నవ్వు, సిగ్గుతో విరిసిన ఎర్రని బుగ్గలు, మేలిమి ముత్యాల పలువరుస, నుదుట పాపిటి బిళ్ల, చెవులకు వేలాడే జూకాలు, ఆకుపచ్చ పట్టుపావడాకు తెల్లని ఓణీ చూస్తే కోనసీమలో వరిపొలాలపై తెల్లని మేఘాలు కమ్మినట్లుంది. కంటి రెప్పలార్చకుండా చూస్తూనే ఉన్నాడు.

ఇంతలో కళ్లముందు చిటికె..కవి మహారాజా! కలలేనా! ఎదుట ఉన్న భామతో మాటలు ఏమైనా?!!...విరహంతో ఉన్న కవి ఎదుట ఉన్న సజీవ శిల్పరూపాన్ని చూసి ముగ్ధుడైనాడు. ప్రేమావేశంలో చేయి పట్టి లాగబోయాడు. మృదువుగా చేయి వదిలించుకొని పరుగెత్తుకు వెళ్లి గుమ్మం చాటున నిలబడి మళ్లీ కిలకిలా నావ్వింది. అబ్బా! ఈ నవ్వుకు కోటి వరహాలైన చాలవు అని మైమరచి కళ్లుమూసుకున్నాడు. కళ్లు తెరిచేంతలో ఆమె మాయం. నిట్టూర్చి మళ్లీ కలం, పుస్తకం, అలోచనలో పడ్డాడు.

ఆ 24ఏళ్ల కన్య కరణం గారి ఏకైక కూతురు శివాని. ఈ కవి 27 ఏళ్ల సుందరం, మునసబు గారి అబ్బాయి. తొలిసారి వీళ్లు కలిసింది పట్టిసీమ వీరభద్రుని బ్రహ్మోత్సవాలలో. జ్ఞాపకాల పందిరిలోకి ఒదిగిపోయాడు సుందరం.

వీరభద్రుడికి వీరంగాలు చేస్తూ భక్తులు బారులు తీరున్నారు. అవతల ఒడ్డున ఉన్న సుందరం "అబ్బా! ఇంత జనంలో దర్శనం ఎంత సమయం పడుతుందో" అని చికాకుగా పడవ ఎక్కాడు. నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో వెంటనే ఒడ్డుకు చేరాడు. దృష్టి మరలింది. ఇసుకలో ఆనందహేలలో నాట్యం చేస్తోంది 20 ఏళ్ల పడుచు పిల్ల. పక్కనే క్యాసెట్ ప్లేయరు, అందులో "ఆనందతాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు" అని సుశీలమ్మ పాట వస్తోంది. ఆ పాటలో లీనమై ఆ కన్య నర్తిస్తోంది. "నగరాజసుత చిరునగవులు చిలుకంగ సిగలోన వగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ" అన్న సాహిత్యానికి చిరునవ్వులు చిందిస్తూ సర్వేశ్వరునివైపు చూసే పార్వతిగా, మరుక్షణమే స్వామి సిగలోన ఎగిసిపడుతున్న గంగగా అద్భుతమైన ఆహార్యాన్ని అభినయిస్తోంది. ఇసుక తిన్నెలు పరవశంతో చూస్తున్నాయి. నీటి అలలు ఆగిపోయి దివినుండి భువికి దిగిన అప్సరస హేలను కన్నులార్పకుండా చూస్తున్నాయి. కూచిపూడి అభినయం చూస్తూ సమయాన్నే మరచిపోయాడు సుందరం. "అమ్మా శివానీ!" అని ఇసుకలో నడువలేక ఆయాసపడుతున్న కరణంగారు దగ్గరకు వచ్చి గట్టిగా పిలిచేంతవరకూ అతనికి,ఆమెకు ఈ లోకం తెలియలేదు. యాదృచ్ఛికమో లేదా దైవసంకల్పమో, ఇద్దరూ ఒకేసారి కళ్లు తెరచారు. అతనికి తెలియకుండా ఇసుక తెన్నెలపై అద్భుతమైన చిత్రం గీసాడు. ఆమెకు తెలియకుండానే శివుని నటరాజ రూపం ఆ నృత్యహేలలో ఇసుక తెన్నెలపై మలచబడింది. అతని సౌందర్య పిపాసను చూసి ఆమె నివ్వెరపోయింది. ఆమె నృత్యంలోని పవిత్రతను చూసి అతడు మాటరాక నిలిచిపోయాడు. చూపులు కలిసాయి. మనసులు కలిసాయి. వెనుదిరిగి చూస్తూ గుడిలోకి వెళ్లింది శివాని. అంతే, వీరభద్రుని దర్శనం సంగతి మరచి ఇంటికి వచ్చి కలం పట్టాడు సుందరం. అలా మొదలైంది ప్రణయగాథ. తొలిచూపులోనే ఒకటయ్యారు. జ్ఞాపకాల పొదరిల్లునుండి బయటకు వచ్చాడు సుందరం.

"నాన్నా సుందరం! మన కరణం గారి అమ్మాయి శివాని ఢిల్లీలో సంగీత నాటక అకాడెమీ వారి వార్షిక నృత్యోత్సవాలలో పాల్గొనేందుకు ఒక నృత్యరూపకం చేయాలిట. దానికి కావలసిన సాహిత్యం నువ్వు రాయగలవేమో అని ఆయన అడిగారు. ఏమంటావ్?" అని మునసబు గారు సుందరాన్ని అడిగారు. సరిగా వినలేదు సుందరం. "నాన్నా సుందరం నిన్నే!..." అని మళ్లీ కేక. శివాని పేరు మాత్రమే వినబడింది. ముందు వెనుక ఆలోచించకుండా సరే అన్నాడు సుందరం.

"అమ్మా శివానీ! నీ నృత్యరూపకం కోసం సాహిత్యాన్ని వ్రాయటానికి మునసబుగారి అబ్బాయి సుందరం వచ్చాడు. వివరాలు చర్చించుకోండి.." కరణం గారు వాకిట్లో కుర్చీ వేసుకొని దస్తావేజులు చూస్తూ తన ముందు నించున్న సుందరాన్ని లోనికి వెళ్లమని చెప్పాడు.

ఆరడుగుల విగ్రహం, విశాలమైన నుదురు, కళ్లలో ప్రశాంతత, ముఖంలో సరస్వతీ దేవి అనుగ్రహం, ఉంగరాల జుట్టు, తెల్లని లాల్చీ, అంచు పంచె, రంగు కడువా...రాజకుమారుడిలా ఉన్న సుందరం లోనికి అడుగుపెట్టాడు. ఎదురుగా తన ప్రణయరాశి నిలుచుని ఉంది. ప్రేమావేశం పొంగినా, తమాయించుకొని "నాన్న గారు విషయం చెప్పారు. అంతటి పెద్ద కార్యక్రమానికి సాహిత్యాన్ని అందించే అర్హత నాకు ఉందో లేదో తెలియదు. కానీ, మీతో కలిసి పని చేయటం నాకు మహదానందం" అని మనసులోని మాటను చెప్పాడు. "సుందరం గారూ! మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ భావావేశం నాడు పట్టిసీమ ఒడ్డునుండి ప్రతి రోజూ చూస్తునే ఉన్నాను. సందేహించకండి" అని అర్ధనారీశ్వరం అనే నృత్యరూపకం యొక్క వివరాలు చెప్పింది. "మీరు ఆదిశంకరుల అర్ధనారీశ్వర స్తోత్రం విన్నారా? అందులో ఈ తత్త్వం అద్భుతంగా వర్ణించారు ఆయన. అది సంస్కృతంలో ఉంది. దానిని సులువైన తెలుగుభాషలో ఒక 2 గంటల రూపకంగా చేయాలని నా సంకల్పం. ఏమంటారు?".

"మంచి సబ్జెక్టు. నాకు స్తోత్రం తెలియదు. మీరు వివరించండి. నేను తెలుగులో అక్షర రూపమిచ్చే ప్రయత్నం చేస్తాను..."అని ఆమె కళ్లలోకి చూశాడు. ఆత్మవిశ్వాసం, ఆరాధన, గౌరవం అన్నీ కలబోసినట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. "రండి, వెనుక శివాలయంలో రంగమండపంలో మాట్లాడుకుందాం" అని గుడి వైపు అడుగులు వేసింది ఆ శివాని. ఆమె నడుస్తుంటే "మరాళీ మందగమనా మహాలావణ్య శేవధీ" అన్న లలితాసహస్రనామావళిలోని నామాలు గుర్తుకు వచ్చాయి సుందరానికి. చిన్నప్పుడు అమ్మ నేర్పిన స్తోత్రం అతనికి చాల ఇష్టమైనది. దానికి భాష్యం కూడా పదిహేనేళ్ల వయసులోనే వ్రాసాడు సుందరం. మంచి కవే కాదు. సుందరం మంచి శాస్త్రీయ సంగీత గాయకుడు కూడా. 10 ఏళ్లపాటు సంగీతాన్ని మంచి గురువుల వద్ద అభ్యసించాడు. అలాగే చూస్తూ ఆమె వెనుక నడిచాడు.

విశాలమైన ప్రాంగణంలో కోటేశ్వరస్వామి-సర్వమంగళాదేవి దేవస్థానం. ముందు భాగంలో ఎత్తైన రంగమండపం. అక్కడ అమ్మ-అయ్యల కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ప్రతియేడు శివరాత్రి బ్రహ్మోత్సవాలలో, దేవీనవరాత్రుల సమయంలో శివాని అక్కడ కూచిపూడి నృత్యసేవతో అమ్మను అయ్యను కొలుస్తుంది. అక్కడ ఉన్న మెట్లపైన కూర్చోమని సుందరానికి సంజ్ఞ చేసి క్యాసెట్ ప్లేయరులో ప్లే నొక్కింది. బాలసుబ్రహ్మణ్యం గారి "చాంపేయ గౌరార్థ శరీరికాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ.." అని శ్రావ్యంగా గీతం వస్తోంది. శివాని క్షణంలో గజ్జెకట్టి శివపార్వతుల రూపం ధరించింది. కైలాసం దిగి వచ్చినట్లు నర్తించింది. స్తోత్రం మొత్తాన్ని తన నృత్యప్రదర్శనతో వివరించింది. కొన్ని నిమిషాల పాటు భౌతికమైన వాంఛలకు దూరంగా సుందరం ఆమెలో అర్ధనారీశ్వర రూపాన్ని దర్శించి రమించాడు. భక్తిభావం ఉప్పొంగి అతని నోట "బంగరువన్నెల మేని మెరుపుల అల్లిన జడ సొబగుల శివాని ఒక వంక, కర్పూర ధవళకాంతి మేని నగవుల రాజిల్లెడి జటాధర భవుడొక వంక, ఏకమై విశేషమై జగతినలరించ నటించె అర్ధనారీశ్వరుడు...." అని ఆశువుగా, శ్రావ్యంగా రాగయుక్తంగా అలపించాడు. ఆశ్చర్యపోయింది ఆతని అయత్నకృత కవితాధారకు. మరల ఆనందహేలలో నర్తించింది. వీరిరువురి గాత్ర నాట్య సంయోగానికి చుట్టూ చేరిన భక్తులు తన్మయులై అర్ధనారీశ్వర తత్త్వాన్ని కన్నుల పండువగా విని దర్శించారు.

తమ తమ ఇళ్లకు చేరుకున్న సుందరానికి, శివానికి తమ అభిరుచులు కలిశాయి అన్న విషయం అర్థమయ్యింది. అలాగే తాము జంట కావాలన్న సంకల్పం దృఢమైంది. కానీ, నృత్యరూపకం పూర్తయేంత వరకు ఆ ఆలోచనలను బహిర్గతం చేయకుండా పక్కకు పెట్టారు. ఒక వారం గడిచేసరికి నృత్యరూపకానికి కావలసిన సంభాషణలు, తెలుగు గేయం, రాగ లక్షణాలు సిద్ధమైనాయి. దాదాపు రెండు నెలలపాటు సుందరం శివానీల జంట అహర్నిశలు శ్రమపడ్డారు. తపస్సులా సాగింది వారి సాధన. సాహిత్యాన్ని, గాత్రాన్ని శివాని మెరుగుపెడితే అభినయాన్ని, భావప్రకటనను సుందరం మెరుగుపెట్టాడు. 2 గంటల రూపకానికి సాధన రోజూ ఆరు గంటల పాటు సాగింది. శివపార్వతుల తత్త్వము ఇద్దరికీ పరిపూర్ణంగా అబ్బింది. ఇద్దరి ముఖాలలో తేజస్సు వచ్చింది. ఆ రెండు నెలలపాటు ఇద్దరూ ఒక పూట భోజన, సుందరం శివపంచాక్షరీ జపం, శివాని గౌరీపూజ శ్రద్ధా భక్తులతో చేశారు.

ఢిల్లీ సంగీత నాటక అకాడెమీ వారి వార్షిక నృత్యోత్సవాలు. వేదికపై శివపార్వతుల అర్ధనారీశ్వర రూపంలో పెద్ద ఇత్తడి విగ్రహం. రూపానికి ఒక పక్క విభూతి మరో పక్క పసుపు అద్దారు. ఒక పక్క మూడవనేత్రం మరొక పక్క కుంకుమ, ఒక పక్క సర్పము, మరొక పక్క బంగారు వంకీ, సిగలో ఒకపక్క గంగ, మరొక పక్క మల్లెపూలు, ఒక కాలికి పాము, మరో కాలికి గజ్జెలు, ఒక పక్క జింక చర్మము, ఇంకో పక్క పట్టు చీర...ఈ విధంగా ఆ ఆదిదంపతుల ఏకమైన రూపం వేదికపై ప్రకాశిస్తోంది. ఇరు పక్కల దీపాలు. ఓం నమశ్శివాయ అన్న నామం హాలులో చిన్నగా అంతటా వినబడుతోంది. వేదికపైకి  వాయిద్య సహకారం ఇచ్చే కళాకారులను పరిచయం చేశారు. ఆ నాటి కళాకారిణి కుమారి శివానిని పరిచయం చేశారు. వేదికపై ఉన్న అర్థనారీశ్వర రూపాన్ని ముమ్మూర్తులా పోలేలా నడుచుకుంటూ వచ్చింది శివాని. ప్రేక్షకులలో కూర్చొని ఉన్న కరణం గారు, మునసబుగారు ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

"సభా రూపంలో ఉన్న పార్వతీపరమేశ్వరులకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మా బృందం వేదికపైనున్న అర్థనారీశ్వర తత్త్వాన్ని ప్రదర్శించబోతున్నాము. ఈ అంశం ఎంచుకోవటానికి కారణం అభేద్యమైన ఈ ఆదిదంపతుల తత్త్వము. ప్రకృతీపురుషులుగా, లోకానికి తల్లిదండ్రులుగా, క్రమశిక్షణ-దయలకు ప్రతిరూపంగా..ఇలా మనం వేసే ప్రతి అడుగులోనూ పార్వతీపరమేశ్వరులు ఆదర్శప్రాయం. మన తల్లిదండ్రులు వీరి రూపమే. ఈ లోకంలో జరిగే విలాసం వీరి లీలలే. హిమవంతుని కుమార్తె అయిన పార్వతి, లయకారకుడు, బూడిద పూసుకొని పాములను ధరించి, భిక్షమెత్తుకునే శివుని ఎందుకు మోహించిందో ఆమెకు మాత్రమే తెలుసు. ఆ వివరాలను ఈ రూపకంలో ప్రస్తావించే ప్రయత్నం చేశాము. ఒకటైన పార్వతీ పరమేశ్వరుల హేల అనిర్వచనీయమైనది. దానిని మనకు ఆదిశంకరాచార్యుల వారు ఆధ్యాత్మిక సంపదగా అందించారు. వారి స్తోత్రాన్ని ప్రేరణగా తీసుకొని మా వాడపల్లిలోని శ్రీ సుందరం గారు అర్ధనారీశ్వర తత్త్వాన్ని గేయము మరియు సంభాషణల రూపంలో ఈ రూపకానికి ప్రాణం పోశారు. అంతే కాదు, ఈరోజు వారు ఈ రూపకానికి గాత్ర సహకారం కూడా అందించబోతున్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను". సభ కరతాళధ్వనులతో మారుమ్రోగింది. సుందరం గంభీరంగా, ప్రశాంతమైన వదనంతో, వినయంతో వేదికపైకి వచ్చి సభకు నమస్కరించారు. కళాకారులు తమ తమ స్థానలను అలంకరించటానికి తెర ఒక రెండు నిమిషాల పాటు దించారు.

తెరలేచింది. అద్భుతమైన కైలాస పర్వత శ్రేణి చిత్రం వేదిక వెనుకభాగాన కైలాసాన్ని తలపిస్తోంది. దాని ముందు అర్ధనారీశ్వరుల విగ్రహం. "వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ" అన్న శ్లోకంతో రూపకం ఆరంభమైంది. రెండు గంటలు ఎలా సాగిందో ప్రేక్షకులకు తెలియదు. శివతత్త్వం, దేవీ తత్త్వం, అర్ధనారీశ్వర తత్త్వం సంగీత నృత్య ప్రదర్శనలలో ఆధ్యాత్మిక ఔన్నత్యంతో ఆవిష్కరించారు శివాని-సుందరంల జంట. లయకారుడైన శివుని గాంభీర్యం, రౌద్రం, ఆనంద తాండవం, తపోదీక్ష ఒక పక్క, దయామయి అయిన పార్వతి ప్రేమ, కరుణ, శాంతము, పతిభక్తి మరో పక్క, వెంట వెంట వైవిధ్య భరితమైన లక్షణాలను అద్భుతంగా అభినయంలో శివాని ప్రదర్శించింది. సముచితమైన స్వర రాగ భావ గర్భితమైన గాత్రాన్ని సుందరం అందించాడు. సభ ఆనందపరవశంలో తేలియాడింది. ప్రదర్శన ముగిసింది. సత్కారాలు, అభినందనలు, ఆటోగ్రాఫులు...పొద్దుపోయేదాకా నడిచాయి.


రైలులో సుందరం, శివాని, కరణం గారు, మునసబు గారు ఢిల్లీనుండి విజయవాడ బయలుదేరారు. ఆగ్రా సమీపిస్తోంది. దూరంగా తాజ్‌మహల్ మెరుస్తోంది. కంపార్టుమెంటు తలుపు దగ్గర నిలబడి తాజ్‌మహల్ అందాలను ఆస్వాదిస్తున్నాడు సుందరం. అతని మదిలో ఇంకా అర్ధనారీశ్వరమే మెదులుతోంది. "సుందరంగారు - నా మనసులోని మాట చెబుతున్నాను. ఈ రూపకం సాధనకు మునుపు మీతో చిన్నపిల్లలా, చిలిపిగా ప్రవర్తించాను. కానీ, ఈ రెండు నెలల సాంగత్యం నాలో ఎన్నో ఆలోచనలను రేపింది. ఆత్మావలోకనం చేసుకునేలా చేసింది. కళను పరమాత్మతో అనుసంధానం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అది ఊహించరాని ఆనందం ఇస్తోంది. ఈ అనుసంధానంలో అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే ఆ అనుభూతి ఎంత మధురమో ఈ రెండు నెలలలో తెలిసింది. మన ప్రేమను దైవానికి అనుసంధానం చేశాము ఈ సాధనలో. అందుకే ఫలితం అద్భుతంగా ఉంది. వీలైనంత త్వరగా మనిద్దరం పవిత్ర బంధంలో ఒకటైతే మన సాధన మరింత వికసిస్తుందని నాకు నమ్మకం కలిగింది...మీరేమంటారు?".

సుందరం ఆమె కళ్లలోకి చూశాడు. చేతితో దూరంగా ఉన్న తాజ్‌మహల్ చూపి "అలాగే. నీకు తోడు నీడగా ఉండటం నా అదృష్టం. అసంపూర్ణమైన నా కళాపిపాసకు ఈ రెండు నెలలలో నువ్వు పరిపూర్ణతనిచ్చావు. మోహావేశంలో కవితలు రాసే రసికుడినుండి నన్ను భగవంతునితో అనుసంధానం చేసుకునేలా ఈ సాధన నాకు తోడ్పడింది. పరమాత్మను వర్ణించటంలో ఉన్న సంతృప్తి, పుష్టి, ఆనందం పాంచభౌతికమైన మన దేహవర్ణనలో దొరకలేదు నాకు. ఈరోజు నా మనసు ఆ అమృతాన్ని చవిచూసింది. అది నీతో నాకు నిత్యము లభిస్తుందన్న నమ్మకం ఉంది. ధర్మే చ అర్థే చ నాతి చరామి శివానీ! " అన్నాడు. ఎదురుగా చందమామ, వెన్నెలలో తాజ్‌మహల్, పక్కనే యమునా నది. వీటి సాక్షిగా వారిద్దరూ పవిత్రబంధంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు.

"నాన్నా సుందరం! నాకేమి అభ్యంతరం లేదు. పార్వతీదేవి లాంటి శివాని మన ఇంటి కోడలిగా రావటం మన అదృష్టం. కానీ...వారు బ్రాహ్మణులు...మనం....". "నాన్నా! మీరు మా ఇద్దరి జంట అందరికీ మంచి చేస్తుందని నమ్ముతున్నారా?" అని మునసబుగారిని అడిగాడు సుందరం. "ఇది వరకు ఏమో, కానీ, మీ సాధన, ప్రదర్శన చూసిన తరువాత పరిపూర్ణంగా నమ్ముతున్నాను" అని సమాధానం చెప్పాడు మునసబు గారు. వెంటనే ఆయన కరణం గారింటికి వెళ్లాడు. "కరణం గారు! ఆడ దిక్కు లేని ఇల్లు మాది. పిల్లలిద్దరూ ఇష్ట పడ్డారు. మీరు అంగీకరిస్తే....."

"మునసబు గారూ! వీరిద్దరి ప్రేమ శరీరాలకు సంబంధించింది కాదు అని నాకు అర్ధనారీశ్వర తత్త్వం సాధనలోనే అర్థమయ్యింది. పరమాత్మను అనుభూతి చెందే మార్గంలో ఇద్దరూ ఒకటవుతామంటున్నారు. ఈ దేహంతో వచ్చి ఈ దేహంతో పోయే కులానికి ఆ పరమాత్మ అనుభూతిలో ఎక్కడండీ స్థానం? ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడని జ్ఞానం ఎందుకండీ? నేను ఈ వివాహానికి కులం పేరుతో అడ్డుపడితే నేను నమ్మిన దైవం పట్ల కృతఘ్నత చూపినట్లే. నా నిత్యకర్మానుష్ఠానం వృథా. అమ్మాయి అబ్బాయి సాంగత్యం పవిత్రమైనది. నటరాజ సేవలో అమ్మాయి ఉంది, ఆ సేవకు ప్రాణమైన సాహిత్య సంగీతాలను అబ్బాయి అందించాలనుకుటున్నాడు. వీరిద్దరినీ ఒకటి చేయటం మన ధర్మం" అని అన్నాడు. కరణం గారి పరిశీలనకు, జ్ఞానానికి, వ్యక్తిత్వవికాసానికి తలవంచి నమస్కరించాడు మునసబు గారు. శివాని సుందరం వంక చూసి సిగ్గుతో తలవంచింది. సుందరం తన జీవితంలో అడుగిడబోతున్న జ్ఞానజ్యోతిని చూసి చిరునవ్వు నవ్వాడు.

జగత్తుకు మూలమైన పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరమే ప్రతి ఇంటిలో ఉండే భార్యాభర్తలు. ఇద్దరూ పరిపూర్ణంగా అనుసంధానమైతే ప్రతి భార్యాభర్తా ఆదిదంపతులే. ప్రతి సంతానమూ వారి అనుగ్రహపాత్రులే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి