8, జూన్ 2015, సోమవారం

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ


చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ


చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
సోబానే సోబానే సోబానే సోబానే

శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి

కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి 

చూడికుడుత నాంచారి: గోదాదేవి (చూడి కుడుత అనేది తమిళ పదం. తాను ధరించిన మాలను స్వామికి ఇచ్చిన అని దాని అర్థం, అలా చేసింది  గోదాదేవి కాబట్టి ఆమెను చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట).

సతులారా! మన గోదాదేవి పతితో కూడియున్నది. పెండ్లిపాటలు పాడండి. (సోబాన అనే పదం కలిగిన పాటలు పెళ్లి పాటలుగా ప్రాచుర్యం పొందాయి)

ఈమె శ్రీమహాలక్ష్మి యట, అలంకారాలకు (శృంగారమునకు) ఏమి తక్కువ?  మన్మథుని తల్లియట, చక్కదనాలు ఏమి తక్కువ? చంద్రుని తోబుట్టువట (క్షీర సాగర మథనంలో లక్ష్మితో పాటు చంద్రుడు కూడా ఆవిర్భవించాడు కాబట్టి వారిద్దరు తోబుట్టువులయ్యారు), ప్రసన్నత మరియు కళకు ఏమి తక్కువ? ఈ గోదాదేవి చాల కోమలమైన శరీరము కలది. 

ఈమె సముద్రుని కూతురట, గంభీరానికేమి తక్కువ? తలచితే లోకానికి తల్లియట దయకేమి తక్కువ? నీటినుండి పుట్టిన కమలంలో నివసిస్తుందట చల్లదనానికేమి తక్కువ?  ఈ గోదాదేవి అన్నీ అపరిమితంగా కలిగినది.

ఈమె దేవతల వందనాలు పొందినదట, అటువంటి మహిమలకేమి తక్కువ?  అమృతానికి చుట్టమట (క్షీర సాగర మథనంలో అమృతము కూడా ఉద్భవించింది కాబట్టి) మరి ఆనందాలకేమి తక్కువ? కౌమార్యంలో ఉన్న ఈమెను ఆత్రుతతో శ్రీవేంకటేశుడు తానే వచ్చి పెండ్లాడాడు. 

అన్నమాచార్యుల వారు గోదా వైభవాన్ని ఈ సంకీర్తన ద్వారా అద్భుతంగా వివరించారు. శ్రీరంగనాథుని పుట్టుకతోనే కొలిచిన గోదా శ్రీమహాలక్ష్మి అవతారంగా దర్శించి ఈ సంకీర్తనను మనకు అందించారు. గోదాదేవి శృంగారాన్ని, సౌందర్యాన్ని, తల్లి ప్రేమను, కరుణను, కళలను, మహిమలను, గాంభీర్యాన్ని, కోమలత్వాన్ని అద్భుతమైన ఉపమానములతో లక్ష్మీదేవితో పోల్చి ఈ కీర్తనకు దివ్యత్వాన్ని చేకూర్చారు. ఆమె ఈ గుణాలను గమనించి శ్రీరంగనాథుడు వచ్చి పెండ్లాడిన సందర్భంగా సతులను సోబాన పాడరమ్మా అని కోరుతున్నాడు సంకీర్తనాచార్యుడు. పదకవితా పితామహుని భావ సంపద, భక్తి జ్ఞాన సౌరభాలు ఈ సంకీర్తన ద్వారా ప్రకాశిస్తున్నాయి. తల్లిలో ఉండే సర్వ సులక్షణాలను అన్నమయ్య ఇందులో పొందుపరచారు.

విష్ణుచిత్తుని ఇంట జన్మించిన ఆ లోకమాత శ్రీరంగనాథునితో ఏకమయ్యే అద్భుతమైన అవతరణిక తిరుప్పావై.  ఆ తిరుప్పావైలోని ఘట్టాలను ఎందరో సంకీర్తనాచార్యులు తమ భావాలలో వ్యక్తపరచారు. గోదావైభవాన్ని స్వయంగా శ్రీవిల్లిపుత్తూరులో దర్శించి తరించిన అన్నమాచార్యుల వారు దానిని తిరుమల-తిరుపతిలో వెలసిన వేంకటేశుడు-అలమేల్మంగల వైభవానుభూతికి సారూప్యంగా వర్ణించారు. తన జీవితాన్ని శ్రీరంగంలోని రంగనాథునికి సమర్పించిన గోదా 'నేను' అన్న భావాన్ని త్యజించి స్వామిలో ఐక్యమయ్యింది. అందుకే లోకవంద్య అయ్యింది.

అన్నమాచార్యుల వారు అమ్మవారిని ఎన్నో కీర్తనలలో నుతించారు. మెరుగు బోడి అన్నా, చూడికుడుత నాంచారి అన్నా, క్షీరాబ్దికన్యక అన్నా, జయలక్ష్మి అన్నా, ఆ అమ్మను ప్రతి ఒక్క సంకీర్తనలోనూ ప్రత్యేకంగా, ఒక వినూత్నమైన భావాన్ని మన ముందు ఆవిష్కరించారు.  పరమాత్మ యొక్క మాయా స్వరూపిణిగా కూడా మనకు వివరించారు. స్వామితో సరస శృంగార సల్లాపాలు సలిపే అమ్మ, లోకమాతగా, మనలను అపారమైన కరుణతో అనుగ్రహించే తల్లిగా, చల్లని చూపులతో కాపాడే కల్పవల్లిగా, సకల సద్గుణాల రాశిగా అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలలో ప్రస్తుతించారు. వాటిలో ఈ చూడరమ్మ సతులాలా ప్రత్యేకమైనది.

వివాహమనేది మానవ జన్మలో ఎంతో పవిత్రమైనది. దానికి సంబంధించిన వేడుకలను, ముచ్చటలను అన్నమాచార్యుల వారు తమ పదశోభలలో ఎంతో మధురంగా జనులకు అర్థమయ్యే భాషలో, అనాటి సమాజానికి అద్ధం పట్టేలా రచించారు. పిడికిట తలంబ్రాల పెళ్లికూతురని పాడినా, సోబాన పాడరమ్మా అని నుతించినా ఆయా వేడుకలను మనకు ఇప్పటికీ తెలిసేలా సాహిత్యాన్ని గుప్పించారు. ఇదే మన సంస్కృతిలోని గొప్పతనం. అది ఒక గంగా ప్రవాహంలాంటిది. మహానుభావుల భావ స్పందనలు రచనలుగా మారి, తర తరాల వారసత్వంగా మనకు అందుతోంది.

అన్నమాచార్యుల పదకవితా వైభవం, ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ కీర్తన ఒక కలికితురాయి.  గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారి గళంలో ఈ సంకీర్తనను వినండి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి