16, జులై 2011, శనివారం

తిరువనంతపురం అనంత పద్మనాభుని వైభవం - భోగీంద్ర శాయినం

కాంచనమయ పద్మనాభుడు

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం

తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి దేవాలయం ఆ మధ్య వార్తల్లో కెక్కింది. ప్రతి ఛానెల్లో ఈ దేవాలయ నేలమాళిగలలో గల అపారమైన సంపద, దాని విలువ, అది ఎవరికి చెందుతుంది, ఎవరికి చెందాలి ఇలా నాటకీయ ఫక్కీలో ఒకే ఛాయాచిత్రాన్ని తిప్పి తిప్పి కథలు అల్లి చెప్పారు. ఏదైతేనేమి? ఆనాటి ట్రావన్కోర్ సంస్థానం వారు అత్యంత నిజాయితీతో ఈ స్వామి సంపదను కాపాడుతూ వచ్చారు అనేది నిర్వివాదాశం. ఈ మహదైశ్వర్యానికి సంబంధించిన వివాదాన్ని పక్కకు పెట్టి ఆలయము, అక్కడి ప్రధాన దైవము గురించి కొన్ని విశేషాలు. ఆ పద్మనాభుని అనుగ్రహంతో, ఆయన సంకల్పంతో 2005లో, మళ్లీ 2015లో  ఆ దివ్యమంగళమూర్తిని దర్శించుకునే భాగ్యం కలిగింది.

చరిత్ర:

ఈ భవ్య దేవాలయం ఎప్పుడు నిర్మించారో సరైన వివరాలు అంతర్జాలంలో తెలియలేదు. కానీ, క్రీస్తు శకం 8వ శతాబ్దంలోనే అనంతపద్మనాభ దేవాలయంపై శాసనాలు, రచనలు జరిగాయి. వైష్ణవ సాంప్రదాయాలలో గురువులైన ఆళ్వార్లలో ఒకరైన మహాత్ములు నమ్మాళ్వార్. ఈయన అనంత పద్మనాభునిపై  ఫలశ్రుతితో కూడిన స్తుతిని రచించాడు. ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధంలో పద్మనాభక్షేత్రం 11 దివ్య దేశాల్లో ఒకటిగా పేర్కొనబడినది. అంతేకాకుండా, బ్రహ్మ, వాయు, పద్మ, వరాహ పురాణాల్లో కూడా ఈ క్షేత్రం గురించి ప్రస్తావన ఉంది. పద్మనాభస్వామి దేవాలయం దేశంలో ఉన్న ఏడు పరశురామ క్షేత్రాలలో ఒకటైన ప్రదేశంలో ఉంది. స్కాంద, పద్మ పురాణాల్లో ఈ విషయం చెప్పబడింది.

తొలుత ఎట్టువీటిల్ పిల్లమార్ అని పిలవబడిన ఎనిమిది మంది (ఏడుగురు బ్రాహ్మణులు, ఒక నాయర్)  ఎట్టర్ర్ యోగం అనే సంస్థగా ఏర్పడి, ఏడుగురికి ఒక్కొక్క వోటు చొప్పున, వేనాడు రాజుగారికి అరవోటు అధికారంతో పద్మనాభస్వామి దేవాలయాన్ని నడిపించారు. కొంతకాలానికి వీరు ట్రావెన్కోర్ మహారాజులపైనే ఎదురుతిరిగి స్వతంత్ర్యముగా దేవాలయాన్ని, అక్కడి రాజ్యాన్ని పాలించాలన్న దుర్బుద్ధితో అప్పటి రాజా వారైన ఆదిత్యవర్మను హత్యచేయించి, వారి మహలును తగులబెట్టించారు. వీరి ఆగడాలను మహారాజా మార్తాండవర్మ విజయవంతంగా అరికట్టి తిరిగి దేవాలయ పరిపాలనాధికారాన్ని ట్రావెన్కోర్ రాజరికం క్రిందకు తీసుకువచ్చాడు. మార్తాండవర్మ పరిపాలనలోనే అనంతపద్మనాభస్వామి దేవాలయలో నిర్మాణాలు, పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగాయి. 1750వ సంవత్సరంలో రాజా అనిళం తిరునాళ్ ట్రావెన్కోర్ రాజ్యాన్ని పద్మనాభుని కైంకర్యానికి అంకితం చేసి, రాజవంశమంతా పద్మనాభుని దాసులుగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుండి, ఈ వంశంలోని పురుషులకు పేరుముందు పద్మనాభదాస, స్త్రీలకు పద్మనాభ సేవిని అన్న బిరుదులు వచ్చాయి. ఈవిధంగా సంస్థానాన్ని పద్మనాభునికి సమర్పించటాన్ని త్రిపదిదానంగా పేరు యిచ్చారు. అప్పటి ప్రభువులను శ్రీపద్మనాభ దాస వంచిపాల వర్మ కులశేఖర కిరీటపతిగా పిలిచారు.
 
ఇప్పుడు ఉన్న గోపురానికి 1566వ సంవత్సరములో శంకుస్థాపన చేయబడింది. ఈ గోపురం 100 అడుగుల ఎత్తు, ఏడు అంచెలలో పాండ్యరాజుల కట్టడాల శైలిని కలిగి ఉంటుంది. ఒక పక్క పద్మతీర్థమనే పుష్కరిణి ఉంది.   విశాలమైన ప్రాకారంలో365-1/4 స్థంభాలతో గ్రానైట్-రాతి కట్టడాలపై అధ్భుతమైన శిల్పకళా నైపుణ్యం మన కళ్లకు ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ ప్రాకారం తూర్పు వైపు నుండి గర్భగుడి వరకు విస్తరించి ఉంటుంది. ప్రధాన ద్వారమునకు ఎదురుగా ఎనభై అడుగుల ధ్వజస్తంభము అలరారుతుంది. తూరుపు వైపున ఉన్న గోపురము క్రింది భాగాన్ని నాటకశాల అంటారు. ఇక్కడ ఏటా రెండు మార్లు మలయాళీయుల మీన మరియి తులా మాసాలలో జరిగే ఉత్సవాల సమయములో కథాకళి నృత్య ప్రదర్శనలు జరుగుతాయి.

మూలవిరాట్టు:

మూడు ద్వారాల నుండి దర్శనమిచ్చే అనంత పద్మనాభుడు

గర్భాలయంలో శ్రీమహావిష్ణువు ఆదిశేషుడైన అనంతునిపై యోగనిద్రలో శయనుడై ఉంటాడు. శయనుడైన పద్మనాభుని కుడిచేయి శివునిపై, శ్రీదేవీ భూదేవి ఒక పక్కగా, నాభినుండి వెలువడిన వికసించిన కమలములో బ్రహ్మలతో శోభిల్లుతు ఉంటాడు. ఈ నల్లని మూర్తి నేపాల్ లోని గండకీ తీరం నుండి తెప్పించిన 12008 సాలగ్రామాలతో తయారు చేశారట. ఈ మూర్తిని ఒక ప్రత్యేకమైన ఆయుర్వేదిక మూలికలతో తయారుచేసిన మిశ్రమంతో లేపనం చేసి ఉంచారుట. ఈ లేపనాన్ని కటుసర్కర యోగం అంటారు, దీనివలన విగ్రహంపై క్రిమికీటకాదులు వాలకుండా ఉంటుంది. నిత్యం జరిగే అర్చన, అభిషేకాల్లో ఉపయోగించబడే పత్ర పుష్పాలను చేతులతో కాకుండా నెమలి పింఛాలతో తొలగిస్తారట. గర్భాలయం మొత్తం ఏకశిలనుండి చెక్కినదే. ఆందుకనే దీనిని ఒట్టక్కళ్ మండపం అంటారు. ఈ మండపానికి సాష్టాంగం చేసేవారు తమ సర్వస్వాన్ని స్వామికి అర్పించినట్లే లెక్క. అందుకనే, కేవలం మార్తాండవర్మ వంశీకులు మాత్రమే ఇక్కడ సాష్టాంగం చేయటానికి అనుమతిస్తారు.మూలవిరాట్టు మొత్తాన్ని చూడాలంటే మూడు ద్వారాల ద్వారా చూడాల్సిందే. మొదటి ద్వారం ద్వారా పద్మనాభుని ముఖము, శివునిపై గల హస్తము, రెండవ ద్వారము గుండా శ్రీహరినాభినుండి వెలసిన కమలములో ఉన్న బ్రహ్మ, స్వామి శ్రీదేవి, భూదేవిల ఉత్సవమూర్తులు, మూడవ ద్వారము నుండి స్వామి పాదములను దర్శించగలము. ఆదిశేషుని పడగల స్వామి ముఖమువైపు క్రిందకు చూస్తుంటాయి. కటుసర్కర యోగం క్రింద మూలవిరాట్టు ముఖము వక్షస్థలము తప్ప మిగిలిన భాగమంతా బంగారు పోతతో ఉంటుంది. ముస్లిం తస్కరుల కళ్లు కప్పటానికి నల్లని కటుసర్కరము వాడినట్లు చెప్పబడుతుంది.

దేవాలయ ప్రాంగణంలో నరసింహస్వామి, శ్రీకృష్ణుడు, అయ్యప్ప, గణపతి, హనుమంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు కూడా ఉంటారు.

గాథలు:

ఈ క్షేత్ర ప్రాధాన్యతను, మూలాన్ని చాటే అనేక గాథలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది దివాకరముని గాథ. ఈ ముని శ్రీకృష్ణుని దర్శనానికై ప్రార్థించగా, ఆ గోపాలుడు ఒక కొంటెబాలుని రూపంలో వచ్చి ముని అర్చనలో ఉన్నా సాలగ్రామాన్ని మింగి వేస్తాడు. దీనికి ఆగ్రహించిన ముని ఆ బాలుని వెంటాడగా, ఆ బాలుడు ఒక చెట్టు వెనుక దాగి ఉంటాడు. ఆ చెట్టు కూలిపోయి, శ్రీహరి అనంతశయనుడై ఉన్న రీతి అక్కడ వెలిసాడు. ముని ఆ చెట్టే శ్రీహరిగా గుర్తిస్తాడు.  కానీ, ఆ విగ్రహం చాలా పెద్ద ఆకారంలో ఉండటం వలన తాను మనసారా చూడలేనని, కొలువలేనని, కాబట్టి తన పరిమాణాన్ని తన శిష్యునికి మూడు మార్ల పొడవుకు తగ్గించుకొనమని హరిని ముని ప్రార్థిస్తాడు. శ్రీహరి వెంటనే ఆతని కోరిక మన్నించగా, విగ్రహం చిన్నదిగా మారుతుంది. అప్పుడు శ్రీహరి మునితో తనను మూడు ద్వారాల ద్వారా కొలువమని ఆదేశిస్తాడు.

నైవేద్యం:

స్వామికి నిత్యము అన్ననైవేద్యముతో పాటు, రత్నములతో పొదిగిన పాత్రలో బెల్లముతో చేసిన పాయసము, పాల పాయసము మొదలైనవి అర్పిస్తారు. గురువారంనాడు ఇక్కడి నరసింహునికి పానకము నివేదిస్తారు. పద్మనాభ స్వామికి అత్యంత ముఖ్యమైన నైవేద్యం ఉప్పు మంగ (పచ్చి మామిడి కాయను ఉప్పు నీటిలో నానబెట్టి), బంగారు పూత కలిగిన కొబ్బరి చిప్పలో నివేదన చేస్తారు. ఈ కొబ్బరి చిప్ప 1200 సంవత్సరాలనాటిది. దివాకరముని కూడా స్వామికి ఇదే చిప్పలో నివేదన చేశాడట.

ఉత్సవాలు:

స్వామికి ఏడాది పొడుగునా అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి అక్టోబర్/నవంబర్ లో జరిగే ఆల్పశీ, మార్చి/ఏప్రిల్ లో జరిగే పైంకుని ఉత్సవాలు. ఈ రెండూ పదిరోజులపాటు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ఉత్సవమూర్తులకు శంఖుముఖం బీచ్ వద్ద పవిత్ర స్నానాలతో ముగుస్తాయి. ట్రావెన్కోర్ మహారాజావారు పాదరక్షలు లేకుండా ఈ ఊరేగింపు, ఉత్సవంలో పాల్గొంటారు. పద్మనాభ, నరసింహ, శ్రీ కృష్ణ ఉత్సవ విగ్రహాలకు పూజాదుల తరువాత సముద్రంలో స్నానం చేయిస్తారు. తరువాత ఊరేగింపుగా కాగడాలతో మూర్తులను దేవాలయానికి తిరిగి తీసుకువస్తారు. ఇది ఈ ఉత్సవాలకు ముగింపు. ఇవే కాకుండా, నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయి.


ఈ క్షేత్రంలో జరిగే అత్యంత వైభవమైన ఉత్సవం లక్షదీపోత్సవం. ప్రతి ఆరేళ్లకొకసారి లక్షదీపాలను వెలిగించి ఆలయాన్ని అలంకరిస్తారు. దీనికి ముందు 51 రోజులపాటు వివిధరకాల పూజలు నిర్వహిస్తారు. తదుపరి లక్ష దీపోత్సవం 2020లో.

దేవాలయములోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశము. స్త్రీ పురుషులు సాంప్రదాయ దుస్తులు ధరించటం తప్పని సరి.

మహారాజా స్వాతి తిరునాళ్:

మహారాజా స్వాతి తిరునాళ్ ట్రావెన్కోర్ సంస్థానానికి 1829-1846 మధ్య మహారాజుగా పరిపాలించారు. సమర్థుడైన పాలకుడిగానే కాకుండా, సంగీతపోషకుడిగా, కృతికర్తగా కూడా స్వాతి తిరునాళ్ పేరు పొందారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలిలో 400కు పైగా కీర్తనలను స్వాతి తిరునాళ్ రచించారు. రాజావారు మళయాళం, సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, ఒరియా, బెంగాలీ మరియు ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం కలవారు. కులశేఖర వంశంలో రాణి గౌరి లక్ష్మీ బాయి, రాజా రాజవర్మ దంపతులకు 1813లో జన్మించారు. చిన్నప్పటినుంచే సంగీతంపై మక్కువ కలిగిన రాజావారు కరమన సుబ్రహ్మణ్య భాగవతార్, కరమన పద్మనాభ భాగవతార్ల వద్ద సంగీతం ఓనమాలు దిద్దటం మొదలు పెట్టారు. అటు తర్వాత ప్రముఖుల గాత్రం విని సంగీత సాధన చేశారు. సంగీత త్రయమైన త్యాగయ్య, శ్యామయ్య, దీక్షితులకు సమకాలీకుడైన రాజావారు తన సంస్థానంలో ఎందరో విద్వాంసులను పోషించి శాస్త్రీయ సంగీత ప్రవాహానికి తనవంతు కృషి చేశారు.

పరిపాలనా పరంగా రాజావారు ఎన్నో గొప్ప సంస్కరణలు చేయటం వలన అవినీతికి అడ్డు కట్ట వేయగలిగారు. అలాగే, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలను, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు.

ఈయన రచనలలో బాగా ప్రాచుర్యం పొందినవి భావయామి రఘురామం, భోగీంద్ర శాయినం. భావయామి రఘురామం అనే కీర్తనను రాజావారు సావేరి రాగంలో కట్టగా, దానిని తరువాత రాగమాలికగా సెమ్మంగూడి శ్రీనివాస ఐయ్యరు గారు కూర్చి చాల పేరు తెచ్చారు. దీనిని భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగారు అద్భుతంగా గానంచేసి అజరామరం చేశారు. రెండవది భోగీంద్ర శాయినం. కుంతలవరాళి రాగంలో రాజావారు అనంతపద్మనాభస్వామి వారిపై సంస్కృతములో క్లిష్టమైన పద ప్రయోగంతో భావుకమైన కీర్తనను రచించారు. ఆ కీర్తన మీ కోసం క్రింద.

భోగీంద్ర శాయినం పురుకుశలదాయినం
పురుషం శాశ్వతం కలయే

వాగీశ గౌరీశ వాసవాద్యమరపరివారాభివందితపదం పద్మనాభం (భోగీంద్ర)

కలితనుత సన్యాసి భజనాను గుణవిహిత సులలితాకారమహితం
కలుషహర పరిసరోజ్జ్వల పద్మ తీర్థాది ఖండితాశేషదురితం
కలశోద్భవాన్విత మహేంద్ర త్రికూటవర మలయాచలేంద్ర వినుతం
కలదమన వంచి మార్తాండవర్మాకలితకాంచన విమాన లసితం పద్మనాభం (భోగీంద్ర) 

భావం:

అనంతశేషునిపై శయనించిన, ప్రజల, రాజులకు క్షేమాన్ని కలిగించే, పురుషుడు, శాశ్వతమైన వాడు అయిన పద్మనాభుని చూడండి. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలచే పూజించబడిన పాదములు కల పద్మనాభుడవు. దివాకర మునిచే నుతించబడిన నీవు ఆయన భక్తికి వశుడవై ఇక్కడ సుందరాకారంలో వెలసినావు. పద్మతీర్థం చుట్టూ కలిగి నీవు సమస్త కలుషములను హరించి, అశేషమైన పాపములను నాశనము చేస్తున్నావు. కలశమునుండి జనించిన అగస్త్యుడు, మహేంద్రుడు, మలయాచలేంద్రుల (మలయాచలముపై ఇంద్రద్యుమ్నుడనే రాజు నారాయణ మంత్రము జపిస్తూ తపస్సులో ఉంటాడు. గొప్ప హరిభక్తుడు ఆయన. ఒక మారు అగస్త్య మహర్షి అక్కడికి రాగా, ఇంద్రద్యుమ్నుడు ఆ మహర్షిని గమనించక తామసముతో వ్యవహరిస్తాడు. అందుకు అగస్త్యుడు కోపగించి ఆయనను తామసముతో కూడిన గజేంద్రునిగా జన్మించి,త్రికూటాచల ప్రాంతంలో విహరిస్తూ, మకరిచే బాధించబడి, అంత్యమున శ్రీహరి అనుగ్రహముతో మోక్షమును పొందాలని శపిస్తాడు. అదే భాగవతములోని గజేంద్ర మోక్షము. ఆ గజేంద్రుడు, అంతకు ముందు జన్మలో ఇంద్రద్యుమ్నుడి చే నుతించబడిన శ్రీహరి అని అర్థం) మొదలైన వారిచే నుతించబడిన వాడవు. చెడును నాశనము చేసేవాడవు, వంచి మార్తాండవర్మ నిర్మించిన బంగారు విమానమునందు శోభిల్లుతున్న పద్మనాభుడవు.

వివరాలు:

ఈ కీర్తనలో ఇంకా మూడు చరణాలు ఉన్నాయి. కానీ అంతర్జాలంలో ఉన్న వాటి సాహిత్యంలో లోపాలు ఉన్నట్లు అనిపించింది. అంతే కాకుండా, వాటిని ఏ విద్వాంసులు కూడా గానం చేయలేదు. ఆందుకనే, ఒక్క చరణాన్ని మాత్రమే పైన పొందు పరచాను. మిగిలిన చరణాల సాహిత్యం క్రింద. వీటి సరైన సాహిత్యం దొరికిన తరువాత అర్థంతో పాటు పొందు పరుస్తాను.

మొదటి చరణంలో శ్రీ మహావిష్ణువు పరివార గణంలో ఉన్న నారదాది అఖిల మునులు, ఆ శ్రీహరి పాలకడలిలో శేషశయనుడై వారిచే నుతించబడటం, సుర భూసురులు కొలుస్తుండగా సుదర్శన చక్రధారియై, నందకము మరొక చేత ధరించి, ఇంకొక చేత కమలము ధరించి శోభిల్లుతున్న పద్మనాభుడు ఆయన భక్త జన బృందాన్ని మహరాజావారు ప్రాకృతములో విశేషంగా కన్నులకు కట్టినట్లుగా నుతించారు.

రెండవ చరణంలో గాథలో చెప్పిన దివాకరముని మరియు పద్మనాభుడు వెలసిన సందర్భాన్ని మనోహరంగా వివరించారు స్వాతి తిరునాళ్ వారు.

మూడవ చరణంలో ఆ శ్రీహరి మెరుస్తున్న మణులు కలిగిన బంగారు కిరీటము, మకర కుండలములు, మెడలో కౌస్తుభ హారము, బంగారు పీతాంబరము, వనమాలలను వర్ణించి అటు తర్వాత ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ప్రముఖమైన లక్ష దీపోత్సవాన్ని, నాభియందు కమలములో బ్రహ్మను కలిగిన ఆ పరిపూర్ణ కరుణామూర్తియైన పద్మనాభుని మనోజ్ఞంగా ప్రస్తుతించారు.

తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి వారి నుతి ఐన భోగీంద్ర శాయినం కృతిని ఎమ్మెస్ సుబ్బులక్షి గళంలో వినండి.

1. క్షీరవారానిధి శ్వేతాంతరీప భవ చిత్రమణి సౌధాస్థితం
నారదాద్యఖిల ముని దివ్య పార్శద విహగ నాయక సదారాధితం
సుర భాసుర సుదర్శన నందక ప్రముఖ శోభనాయుధ సేవితం
శ్రీ రసాకర సరోజామ్రుదిత పాద వందారుజన భరణోద్యతం పద్మనాభం (భోగీంద్ర)

2. పరమ భక్తోత్తమ దివాకర యతీంద్ర కృతగురు పుణ్య వసుధాగతం
సురుచిరాద్భుత బాలవేష సాక్షాత్కార పరితోష శిర లాలితం
పరిపూజనార్థ సాలగ్రామ హరణాట్టత్తరు యోగి కరవారితం
పాదపాద్యస్థితం పద్మనాభం (భోగీంద్ర)

3. అరుణాభమణి మకుట మకర కుండల ధార హార కౌస్తుభ భూషితం
పరివీత పీతాంబరాకలిత కాంచికావరవన్య మాలాంచితం
నిరవద్య వంచీశ సకృత లక్షదీపాది నిత్యోత్సవానందితం
సరసీరుహోదర పలాశాయతాక్షి పుట పరిపూర్ణ కరుణామృతం పద్మనాభం (భోగీంద్ర) 

2 కామెంట్‌లు: