14, జులై 2011, గురువారం

గురుపౌర్ణమి - గురువు యొక్క ప్రాముఖ్యత, పాత్ర

 (హృషీకేశ్ లోని దివ్య జీవన సంఘం స్థాపకులు, మహనీయులు, ఇరవైయ్యవ శతాబ్దపు భారతీయ గురువులలో అగ్రగణ్యులు సద్గురువు స్వామి శివానంద. వారు గురుతత్త్వముపై వ్రాసిన అద్భుతమైన ఆంగ్ల వ్యాసములో మొదటి అంకములోని రెండు అంశాలకు తెలుగులో అనువాదం. గురుపౌర్ణమి సందర్భముగా నా గురువులు నిడుగొంది వేంకట రమణరావుగారు పాదపద్మములకు సమర్పిస్తూ)

ఆది శంకరులు


గురువు యొక్క ప్రాముఖ్యత, పాత్ర

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

పరమశివుని మొదలు, శంకరాచార్యులు మధ్యలో, నా గురువులైన శ్రీ రమణరావు గారి వరకు గల గురు పరంపరకు నా నమస్కారములు (గురువందనము).

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః

పరమ శివునికి, శ్రీ మహావిష్ణువునకు, బ్రహ్మసూత్రములు రచించిన వ్యాసమహామునికి, వాటికి భాష్యములు చెప్పిన ఆది శంకరులకు, మరల మరల నమస్కరింతును (గురువందనము).

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

గురువే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మము. అట్టి గురుదేవునకు నమస్కరింతును (శ్రీ గురుగీత).

శిష్యుని సన్మార్గంలో నడిపించుటకు ప్రత్యక్షరూపములో వచ్చిన గురువే దైవము అని దీని భావము. దైవకృప మరియు కరుణ గురువు రూపాన్ని పొందుతుంది. గురువును దర్శించుట దైవాన్ని దర్శించుటయే. తన ఉనికితో భక్తిని నాటి, చాటి, అందరినీ పరిశుద్ధులను చేశే దివ్యమూర్తి సద్గురువు. గురువు సంపూర్ణముగా మానవునికి దైవానికి మధ్య గల లంకెయే. తాను ఏమిటో అవగాహన పొంది ఉండుటచే గురువు ఈ రెండిటికీ అందుబాటులో ఉంటాడు. శాశ్వతమైన దైవత్వపుటంచులలో నిలబడి భవసాగరములో కొట్టుమిట్టాడుతున్న మానవుని ఒకచేతితో అందుకుని మరొకచేతితో సచ్చిదానందమువైపు ఉద్ధరిస్తాడు.

సద్గురువు:

కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వాములు


కేవలం పుస్తక జ్ఞానము గురువగుటకు అర్హత కాదు. వేదములను చదివి ఆత్మానుభవము పొందిన వాడే గురువగును. జీవన్ముక్తుడే నిజమైన గురువు. అతనే సద్గురువు. బ్రహ్మజ్ఞానము కలిగి, బ్రహ్మమే తానైన వాడు సద్గురువు. సిద్ధులను, విద్యలను ప్రకటించి ప్రదర్శించుట గురువు మహత్తునకు తార్కాణంకాదు. సద్గురువు వీటిని కేవలం సాధకులకు పారలౌకిక శక్తులు కలవని నిరూపించుటకు, వారిని ప్రోత్సహించుటకు, వారిలో విశ్వాసము కలిగించుటకు చాలా అరుదుగా ప్రదర్శించవచ్చు తప్ప ఎల్లప్పుడూ వాటితోనే జీవనం సాగించడు.సద్గురువు అగణిత సిద్ధ సాధకుడు, సర్వైశ్వర్య యోగము కలవాడు.

సద్గురువు పరబ్రహ్మము, మరియు అనంత జ్ఞానకరుణా సంపన్నుడు. మానవుని  ఆత్మ అనే నావకు నావికుడు. ఆయన పరిపూర్ణానంద స్వరూపుడు. మానవుని సమస్త కష్టములను, దుఃఖములను, అవరోధములను పటాపంచలు చేసే దివ్యశక్తి గురువు. మనిషియొక్క అజ్ఞానమనే చీకటి తెరను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు సద్గురువు. మానవుని శాశ్వతమైన దైవత్వమువైపు నడిపేవాడు సద్గురువు. జ్ఞానమనే రజ్జును (తాడును) ఇచ్చి సంసారమనే సాగరములో మునుగకుండా కాపాడేవాడు సద్గురువు. గురువే దైవము. గురుముఖమున వెలువడిన మాట ఆ దేవుని వాక్కే. గురువు ఏమీ మాటాడనక్కరలేదు. వారి సాంగత్యము ఉత్తేజపూరకము, ఆనందకారకము. మానవుడు కేవలం ఇంకొక మానవ రూపము ద్వారానే జ్ఞానసముపార్జన చేయగలడు. ఆందుకనే భగవంతుడు మానవరూపంలో గురువుగా ప్రకటితమవుతున్నాడు. గురువు పూర్ణత్వమునకు సారూప్యము. ఆ మహనీయుని లక్షణములు మన జీవనాన్ని మలచుకునే సదవకాశములు. అట్టి ఉన్నతాత్మ పూజించుటకు, గౌరవించుటకు పూర్తిగా అర్హుడు.

గురువు మోక్షద్వారము. ఆయనే సచ్చిదానందమునకు సోపానము. కానీ, వాటిని పొందుటకు సాధకుని యత్నము తప్పనిసరి. ఈ యత్నములో గురువు సహాయకుడు, నిర్దేశకుడు మాత్రమే.

గురువు యొక్క ఆవశ్యకత:

దక్షిణామూర్తి

క్రొవ్వొత్తిని వెలిగించుటకు ఇంకొక వెలుగుతున్న సాధనము ఎలాగ అవసరమో, సాధనామార్గములో మొదటి మెట్టునున్న సాధకునికి గురువు అలాగే ఆవశ్యకము. ఉద్దీపమైన ఆత్మ మాత్రమే ఇంకొక ఆత్మను మోక్షమువైపు నడుపగలదు.  స్వతంత్రముగా గురువులేకుండా సాధన చేసేవారు ఎక్కడో ఒక చోట అవరోధములకు గురి అయ్యి, వాటిని ఎలా ఎదుర్కొని అధిగమించాలో తెలియక సతమతమవుతూ గురువును ఆశ్రయిస్తారు. కేవలం బద్రీనాథ్ ఇదివరకు వెళ్లిన వాడు మాత్రమే అక్కడికి వెళ్లుటకు మార్గము చెప్పగలడు. ఆధ్యాత్మిక మార్గములో కోతిలాంటి మనసుకు ఎన్నో అవరోధములు, ఎన్నో దారితప్పే పరిస్థితులు. గురువు వీటిని తొలగించి సరైన మార్గములో నడుపుతాడు. ఇది మోక్షమార్గము, ఇది బంధనముల మార్గము అని వివరించి చెప్పే సాధనము గురువు. ఈ దిశానిర్దేశములేకుంటే బదరీనాథ్ చేరవలసిన ప్రయాణికుడు కొత్తఢిల్లీ చేరవచ్చు.

వేదవేదాంగములు, పురాణేతిహాసములు ఒక భయంకర కీకారణ్యము వంటివి. వీటిలో విరుద్ధంగా అగుపించే మార్గములు, అగమ్య గోచరములు, రహస్య సందేశములు ఎన్నో. సందేహ నివృత్తి కలిగించి, అర్థమును విపులీకరించి, సారాన్ని అరటి పండు ఒలిచి యిచ్చినట్లు పంచే సాధనము గురువు.

ఆధ్యాత్మిక మార్గములో ఉన్న ప్రతి సాధకునికి గురువు తప్పనిసరి. కేవలము గురువు మాత్రమే సాధకుని లోపాలను గుర్తించి సరిదిద్దగలడు. మన వీవుపై గల మలినాన్ని అద్దములేకుండా ఎలా చూడలేమో, అలాగే అహంకారము వలన మనలోని లోపాలను గ్రహించలేని బలహీనతను గురువు సరిదిద్దగలడు. గురు సాంగత్యము ద్వారానే మనలోని దుర్గుణములను, లోపాలను పోగొట్టుకొనగలము. గురు సాంగత్యము వలన ప్రాపంచిక లోభములను, దుర్మార్గపు ఆకర్షణలను విస్మరించి, అధిగమించి ముందుకు వెళ్లగలము. గురు సాంగత్యము, గురుబోధ లేకుండా మహనీయులైన వారు కారణ జన్ములు. వారిని ఉదహరించి గురువు యొక్క ఆవశ్యకతను తక్కువచేసి మాట్లాడటం సరి కాదు. అటువంటి కారణజన్ములు అసామాన్యము, అరుదే కానీ సామాన్యము, అగురు ఆధ్యాత్మిక సోపానమునకు ఉదహరణము కాదు. వారికి ఆ కారణ జన్మము పూర్వజన్మలయందు చేసిన విశేష సేవా జ్ఞాన ధ్యాన తత్పరత వలన. వారిదివరకే గురువు చెంత అభ్యాసము చేసి తరించి, ఈ జన్మలో ఆ మార్గాన్ని కొనసాగిస్తున్నారు. అంతమాత్రమును గురువు యొక్క ప్రాముఖ్యత తగ్గినట్లు కాదు. కొంతమంది 'స్వయముగా ఆలోచించండి. ఏ గురువుకూ దాసోహం కావద్దు. ఎవరినీ అనుకరించవద్దు' అని బోధిస్తుంటారు. వారు తమ మాటలను వినే వారికి తమను తాము గురువుగా ప్రకటించుకునే తహతహ వలన ఆవిధంగా బోధిస్తారు. అటువంటి బూటకపు గురువులను అనుగమించవద్దు.

చరిత్రలో ప్రతి గొప్పవ్యక్తికీ ఒక గురువు ఉన్నాడు. ఋషులు, మునులు, యోగులు, బైరాగులు, తత్త్వవేత్తలు, అధ్యాపకులు, అవతారపురుషులు - ఇలా స్వయంగా ఎంత గొప్పవారైనా, అందరికీ గురువులు ఉన్నారు.  శ్వేతకేతుకు ఉద్దాలకుడు, మైత్రేయునకు యాజ్ఞవల్కుడు, భృగువునకు వరుణుడు, నారదునకు సనత్కుమారుడు, నచికేతునకు యముడు, ఇంద్రునకు ప్రజాపతి - ఇలా ఎందరో గురువుల వద్ద కఠిన దీక్షతో బ్రహ్మవిద్యను అభ్యసించారు. అలాగే, కృష్ణుడు సాందీపుని వద్ద, రాముడు వశిష్ఠుల వద్ద అభ్యసించారు. దేవతలకు కూడా గురువుగా బృహస్పతి కలడు. మహాజ్ఞాన సంపన్నులైన దైవ స్వరూపులు కూడా దక్షిణామూర్తి పాదాలవద్ద జ్ఞానాన్ని పొందారు.

సాధనలో తడబడు అడుగులు వేస్తున్న సాధకునికి మానవరూపంలో గురువు అత్యంత ఆవశ్యకము. ఆతనికి భగవంతుడు గురువు కాజాలడు. కేవలం శుద్ధమైన అంతఃకరణము, అత్యున్నత విలువలు, సర్వ సద్గుణములు కలిగిన వానికి మాత్రమే భగవంతుడు గురువు కాగలడు.

గురువును ఎంచుకొనుట ఎలా?

సద్గురువు స్వామి శివానంద

ఏ మహాత్ముని వద్ద శాంతి లభిస్తుందో,  వారి సంభాషణలు, ఉపన్యాసములవలన ప్రేరణ కలుగుతుందో, ఎవరి వద్ద నీ సందేహాలు నివృత్తి అవుతాయో, స్వార్థము, లోభము, కోపము, మోహము లేకుండా, ప్రేమ, కరుణలతో 'నేను, నాది' అన్న భావనలను లేని అట్టి మహాత్ముని నీ గురువుగా భావించవచ్చు.  నీ సాధనలో ఓరిమితో పర్యవేక్షిస్తూ, విశ్వాసాలకు భంగం కలుగకుండా, నీవున్న స్థాయినుండి ముందుకు నడిపే, ఎవరి వద్ద నీవు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతున్నావన్న భావన కలుగుతుందో, అట్టి వ్యక్తిని నీ గురువుగా భావించవచ్చు.  గురువుగా భావించిన తరువాత సంపూర్ణమైన విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు సాగుము. భగవంతుడు నీ వెంటనే ఉంటాడు.

గురువును ఎంచుకొనుటలో నీ వివేచన, పరిశీలన, పరిశోధనా శక్తిని అతిగా ఉపయోగించవద్దు. దాని వలన నిరాశే మిగులును. ఉత్తమమైన గురువు లభించనపుడు, జ్ఞానము కలిగి, సామాన్యమైన జీవనము గడుపుతూ, ఆ మార్గములో ఉన్న సాధువును గురువుగా భావించుము. ఏ విధముగా అయితే సరైన అధ్యాపకుడు లేని పక్షములో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఐదవ తరగతి విద్యార్థికి సందేహనివృత్తి చేసి నిర్దేశించగలడో, ఏ విధముగా అయితే సివిల్ సర్జన్ లేనప్పుడు అసిస్టెంట్ సర్జన్ రోగికి చికిత్స చేయగలడో, అలాగే ఉత్తమోత్తమమైన గురువు అందుబాటులో లేనప్పుడు సాధు తత్త్వము కల ఉత్తమ వ్యక్తులు గురువుగా నీకు సహాయపడగలరు. ఇటువంటి అవకాశము కూడా లేనప్పుడు, ఆది శంకరులు వంటి మహనీయలు రచించిన అధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ, వారి చిత్ర పటములను భక్తి విశ్వాసములతో ఆరాధిస్తూ  ఉండండి. క్రమముగా ప్రేరణ కలిగి, గురువు స్వప్న సాక్షాత్కారము ఇచ్చి నీకు దిశానిర్దేశము చేయగలడు. శ్రద్ధ కలిగిన సాధకునికి గురు అనుగ్రహము అనూహ్య పరిస్థితులలో కలుగుతుంది. ఏకనాథునికి ఈ విధముగా ఆకాశవాణి 'దేవగిరిలో జనార్దన పంతును దర్శించుము. వారు నీకు సరైన మార్గమున వెళ్లుటకు సాయపడుదురు' అని చెప్పెను. అలాగే, తుకారాంనకు స్వప్నములో 'రామకృష్ణహరి' అన్న మంత్రము కలిగెను. ఆయన దానిని సాధన చేసి శ్రీ కృష్ణుని సాక్షాత్కారమును పొందెను. నామదేవునకు శ్రీ కృష్ణుడు మల్లికార్జునములో యున్న ఒక సాధువు వద్ద శిష్యరికము చేయుమని నిర్దేశము కలిగెను. ఇదే విధముగా బిల్వమంగళునికి వేశ్య యైన చింతామణి గురువు కాగా, తులసీదాసుకు అజ్ఞాత వ్యక్తి ద్వారా హనుమంతుని కృప, ఆ వాయుసుతుని ద్వారా రామ సాక్షాత్కారము కలిగెను.

సామర్థ్యము కలిగిన శిష్యుడు ఎప్పుడూ సమర్థుడైన గురువు యొక్క శోధనలో ఉండడు. ఆత్మ సాక్షాత్కారము పొందిన మహానుభావులు మన సమాజంలో పుష్కలం. వారిని అజ్ఞానము వలన సామాన్యులు గుర్తించకపోయినా, శుద్ధ అంతఃకరణము కలిగి, సాధు స్వభావులైన వారు గుర్తించి తమ ఆధ్యాత్మికోన్నతికి వినియోగించుకుంటారు.  ఈ ప్రపంచమున్నంత వరకు గురువులు, వేదములు సతమతమవుతున్న మానవునికి ఆధ్యాత్మిక మార్గములో సహాయపడటానికి సాధనాలుగా ఉంటాయి. సత్పురుషులు, సద్గురువులు ఎల్లప్పుడూ ఉన్నారు, ఉంటారు. కలియుగములో సత్యయుగం కన్నా తక్కువ ఉండవచ్చు.  కానీ, ఉన్న కొద్దిమంది కూడా సాధకునికి సహాయపడటానికి నిరంతరం అందుబాటులో ఉంటారు. వారి వారి సామర్థ్యాన్ని, అవకాశాలను బట్టి సాధకులు మార్గాన్ని ఎంచుకుని ముందుకు నడుస్తుంటే, సద్గురువులు తప్పక తారస పడతారు.

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః

అజ్ఞానమనెడి చీకట్లలో కొట్టుమిట్టాడుచు సన్మార్గమును (పురుషార్థసాధకమైన కర్తవ్యమార్గమును) గుర్తింపలేనివానికి గురువు జ్ఞానాంజనమనెడి శలాకతో (చక్కని జ్ఞానోపదేశముతో) కనువిప్పుగావించును. అట్టి గురుదేవునకు నమస్కరింతును - శ్రీ గురుగీత.

గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః

అన్ని విద్యలకు నిధియైన వాడు, భవము (జనన మరణముల మధ్య ఉన్న అనుభవము) అనే రోగమునకు వైద్యుడైన వాడు, సమస్తలోకములకు గురువైన వాడు అయిన దక్షిణామూర్తికి నమస్కరింతును -  శ్రీ గురుగీత.

3 కామెంట్‌లు: