29, నవంబర్ 2010, సోమవారం

శుభోదయం

శరదృతువునకు వీడ్కోలు పలుకుదామా అనే వేళ, పొద్దున్నే పై అంతస్థుకి వెళ్లి చూస్తే - అహో ఏమి సౌందర్యం ప్రకృతి కౌగిట ఒదిగిన భాగ్యనగరానిది. మబ్బుల, దట్టమైన మంచు చాటున దాగిన సూర్యుడు, విశ్వవ్యాప్తమైన ఆ పరమాత్మకు జీవరాశులన్నీ ధూపం వెలిగించాయా అన్నట్లు పొగమంచు, చరిత్రకు ప్రతిబింబమైన కులీకుతుబ్ షా సమాధుల నుండి ఆ యవనకాంతల హృదయాలు నా కౌగిలిని వీడకు ప్రభూ అనే ప్రణయ విలాపాన్ని అంబరపు వీధిల్లో ఆలపిస్తున్నాయా అన్నట్లు ఒకవైపు,

అప్పటికే లేచి గంట అయ్యి, గృహిణులు ఉరుకులు, పరుగులతో వాకిళ్లు చిమ్మి, ముగ్గు పెట్టి, ధన ధనమంటూ అంట్లు కుమ్మరించి, కడిగే మా పేదల బస్తీ, బద్ధకంగా నిద్దుర లేచి ఈ చలిలో ఇంకాసేపు పడుకుందామా అనే భర్తలు, ఉదయమే ఉద్యోగానికి వెళ్లే పురుషోత్తములు, అయిష్టంగా బడికి తయారవుతున్న పిల్లలు, ఎంత కిక్ కొట్టినా ఆరంభం కాని బైకులు, టక టక మని బయలుదేరే ఆటోలు ఇంకొకవైపు,

మాకు ఇంకా తెల్లవారలేదండీ, ఇంకా రెండు గంటలుంది లేచి తయారవటానికి అనే సాఫ్ట్ వేర్ నిపుణులు మళ్లీ దుప్పటితన్ని పడుకుంటే, ఆ హై-టెక్ సిటీ భవంతులు విస్తుపోయి చూస్తునట్టుగా ఉంది. శుభోదయం సోదర సోదరీమణులకు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి