17, ఆగస్టు 2010, మంగళవారం

క్రీడా స్ఫూర్తి - విజయం - ఏమి చెయ్యాలి?

"అబ్బ, మన వాళ్లు ఇంతే. ఏదో ఒక మ్యాచ్ గెలిచి పది ఓడిపోతారు...". "అసలు మనవాళ్ళు అయిదు రోజుల ఆట ఆడుతున్నారా లేక వన్డే నా?. బ్యాట్ నిలిపి క్రీజ్ లో ఉండలేరు ఎందుకని?. టప టప పడిపోవటమే పేక ముక్కల్లా వికెట్లు".."అబ్బ మనవాళ్ళ ఫీల్డింగ్ ఘోరం..వంగితే నిన్చోలేరు, నించుంటే వంగలేరు".."వాడి సెంచరీ కోసమే కాని మ్యాచ్ గెలిపిద్దాము/కాపాడుదాము అని కాదు"... "అంతా ఆరంభ శూరత్వం సార్. మొదట్లో పేరు రావాలని బాగా ఆడతారు. తర్వాత డబ్బు, పేరు, గుర్తింపు వచ్చేసరికి ఆట మీద శ్రద్ధ పోతుంది"... "ఆ పాకిస్తాన్ వాళ్లు చూడు ఎంత పోరాట పటిమ చూపించారో?. ఎందుకు మనవాళ్ళు ఆ తామసం చూపించరు క్రీడల్లో?"... "అవార్డులు/అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటారు కానీ, ఆటకొస్తే సున్నా"... - ఇదండీ మనం రోజు వినే భారతీయ క్రీడాకారుల మీద ఆరోపణలు.  క్రికెట్ ఒక్కటే కాదు - టెన్నిస్, హాకీ, ఇలా ప్రజాదరణ కలిగిన ప్రతి క్రీడలోను విమర్శ తప్పట్లేదు. ఎందుకని?.
  1. క్రీడాకారులకు శారీరిక, మానసిక దారుఢ్యం తక్కువ - పెరిగే వయస్సులో శరీర సౌష్టవం మీద శ్రద్ధ లేకుండా, నెట్టుకు వచ్చి ఆటలో ఆటుపోట్లు తిని గాయాలకు తల ఒంచుతున్నారు మన క్రీడాకారులు. దీనికి కారణం - వారి వృత్తి అయిన క్రీడకు కావలిసిన శారీరిక శక్తి మీద అవగాహన లేకపోవటం, ఉన్నా, దాన్ని పెంపొందించు కోవటానికి ఇంట్లో వసతులు, జీవన శైలి, బయట వసతులు లేకపోవటం. అంటే - సరైన తిండి, అవగాహన, ప్రేరణ ఉన్న సరైన గురువు, వ్యాయామం చేసే సదుపాయాలు - వ్యాయామశాలలు మరియు వాటికి కావలసిన పరికరాలు. ఇవేవీ పెరిగే వయసులో సరిగ్గా లేక పోవటం శరీరం ఫిట్ గా ఉండకపోవటానికి కారణం.
  2. క్రీడ అనేది జాతీయ జీవన శైలిలో ముఖ్యమైన భాగము కాదు. మనకు ఎంత సేపూ పిల్లలు ఐ.ఐ.టి లో ఎలా చేరాలి, లేక డాక్టర్ ఎలా చెయ్యాలి అనే రంధి తప్ప వారి శారీరిక మానసిక వికాసం పై అవగాహన లేదు, దాని వల్ల ఎంత ఉపయోగమో అంత కన్నా తెలీదు. ట్యాలెంట్ అంటే కేవలం పరీక్షల్లో మార్కులు అన్నది మన నిఘంటువు లో ఉన్న అర్థం. ట్యాలెంట్ లో శారీరిక, మానసిక వికాసం (వాటికి కావలిసిన దారుఢ్యం) లేవు. పిల్లలకు ఆటమీద కన్నా టీవీలో వచ్చే టాం అండ్ జెర్రీ చాలా కిక్కుని ఇస్తుంది. బయటకి వెళ్లి ఆడాలంటే మన పిల్లలకు మహా బాధ. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి వాళ్లు అడిగింది ఇచ్చారు కదా?. జీవితం అంటే శ్రమ అని నేర్పలేదు కదా?
  3. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, నలుగురిలో పరీక్షించబడి, గుర్తించబడి, ప్రోత్సహించబడి ముందుకు వెళ్లి క్రీడను ఒక వృత్తిగా ఎంచుకునే విద్యా వ్యవస్థ, సామాజిక స్పృహ, దృక్పథం లేదు. ఉన్న సదుపాయాలను వాడుకునే జిజ్జ్ఞాస, కుతూహలం, ఉత్సాహం తల్లిదండ్రుల్లో, బాలల్లో, యువతీయువకుల్లో చాలా తక్కువ. మూస చదువులు, మూస ఆలోచనలు.ఒత్తిడిని తట్టుకునే మానసిక శక్తి చిన్న వయసునుంచే రావాలి. అది చాలా తక్కువమంది తల్లిదండ్రులు ఇస్తున్నారు పిల్లలకు. ఇంతకు ముందు తరంలో అసలు లేదు. ఇప్పుడు క్రీడల్లో ఒత్తిడి చాలా ఎక్కువ. దానికి సరిపడే మానసిక ప్రశాంతత, పరిపక్వత క్రీడాకారుల్లో ఉండాలంటే ఎన్నో ఏళ్ళు వారిని కఠోరమైన పరీక్షలకు గురిచేసి, ప్రోత్సాహం ఇచ్చి, వెన్నుదన్నుగా నిలిచే తల్లిదండ్రులు, గురువులు, సమాజం మన దగ్గర లేదు. మనం వికాసం కన్నా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. 
  4. క్రీడాకారుల్లో, అధికారులలో అవినీతి - ఎడారిలో ఆముదం చెట్టులా, మనకున్న గుంపులోంచి ఎన్నుకున్నవాళ్లకు పూర్తి క్రీడా సామర్థ్యం, తమ వృత్తి పట్ల అంకిత  భావం ఉండవు.  దేశలాభం కన్నా స్వలాభం ముఖ్యమనుకునే వ్యాపార ధోరణి. విపరీతమైన డబ్బు కొన్ని క్రీడలకు ఉండటం, మిగతా వాటికి లేకపోవటం. సమతుల్యత లోపించటం వలన చాలా క్రీడల మీద ఉత్సాహం కూడా తగ్గిపోయింది. క్రీడ వ్యవహారాలు చూసుకునే అధికారులు అంతా రాజకీయ నిరుద్యోగులే. దీనితో అవి పూర్తిగా అవినీతి మయం. మన బీ.సి.సి.ఐ, ఐ.పీ.ఎల్, ఐ.హెచ్.ఎఫ్, ఏ.సి.ఏ కుంభకోణాలు వీటికి ఉదాహరణలు. ఇవి కాకపొతే క్రీడాకారుల మ్యాచ్ ఫిక్సింగ్. ఇది అత్యంత దారుణమైనది. ఒక ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో మన సారథి ప్రత్యర్ధి విజయం కోసం డబ్బుకు కక్కుర్తి పడి ఆటను వదులుకున్నాడు అనే ఆరోపణ ఎంత ఘోరమైనది?
  5. విజయం వచ్చినప్పుడు మునగ చెట్టు మనం ఊహించనంత ఎక్కించి, ఒక్క పరాజయం రాగానే కింద పడేసి ఘోరమైన వ్యాసాలు రాసి, టీవీ చానెళ్ళలో భయంకరంగా విమర్శించి చితకబాడే సంస్కృతి. వాళ్లు కూడా మనలాగే మనుషులు, ఓటమి జీవితంలో ఒక సహజమైన భాగమే అన్న భావన లేకపోవటం, పనీ పాటలేని మీడియా చానల్స్ రంధ్రాన్వేషణ చెయ్యటం. క్రీడాకారులకు సరైన సమీక్ష చేసి, వారి లోపాలను సరిదిద్దే వ్యవస్థ, ప్రజలు, మీడియా లేవు. విపరీతమైన వ్యక్తి పూజా, ఆరాధన. ఇది కొంత అవసరమే, కానీ, వాళ్లు కూడా మనుషులే కదా?. సచిన్ చాలా గొప్ప క్రీడా కారుడే. కానీ, అతడిని దేవుడి లాగ పూజించటం వలన అతడు సరిగా ఆడనప్పుడు అతని మీద తీవ్ర విమర్శలు. అతనికి తట్టుకునే పరిపక్వత ఉంది కాబట్టి ఇన్నాళ్ళు నిలిచాడు. సానియా మిర్జా లాంటి వాడు అయితే రెండేళ్లలో క్రికెట్ వాడికి పారిపోయే వాడు.
 మన సానియా మిర్జా సంగతే చూడండి?. - ఆ అమ్మాయికి ఆట కొంత వచ్చు. కాని, ఆట మీద పట్టు, అవగాహన, అనుభవం, విజయాలు రాక ముందే మనం మునగ చెట్టు ఎక్కించి ఎక్కడో కూర్చోబెట్టాము. ఆ అమ్మాయికి మనం ఇచ్చిన గౌరవం, గుర్తింపు చాలా మటుకు ఆ అమ్మాయి సౌన్దర్యానికే తప్ప ఆటకు కాదు.  ఏ ఒక్క ముఖ్యమైన ట్రోఫి గెలవకుండా, ఎటువంటి గుర్తింపును ఇచ్చే విజయాలు లేకుండా, ఆ అమ్మాయిని మీడియాలో తెగ చూపించి, చివరికి మనం పద్మశ్రీ అవార్డ్ కూడా ఇచ్చేశాము. ఏమయ్యింది ఇప్పుడు?. 35 ర్యాంకు నుంచి 150 ర్యాంకుకి దిగజారింది. కామన్వెల్త్ క్రీడల్లో మనదేశం తరపున ఆ అమ్మాయి ఆడే సామర్థ్యం లేకుండా పోయింది. అలాగే, ఎంతో మంది కను మరుగు అయిపోయ్యారు పైన చెప్పిన ఏదో ఒక కారణం వల్ల.

క్రీడాకారులు మారాలంటే, మనం మారాలి. తల్లిదండ్రులు మారాలి, క్రీడా వ్యవస్థలో రాజకీయనాయకులకు స్థానం లేకుండా చెయ్యాలి. క్రీడాకారులను సరైన మోతాదులో విమర్శించాలి, ప్రోత్సహించాలి. అన్ని క్రీడలను గౌరవించాలి, ఆదరించాలి. క్రీడను జీవన విధానంలో ముఖ్యమైన భాగం చెయ్యాలి. చదువుల్లో క్రీడను, దానిలో ప్రతిభను తప్పనిసరి చెయ్యాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి