1, జులై 2010, గురువారం

రాష్ట్ర రాజకీయ పార్టీల భవిష్యత్తు

2009 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సానుభూతి పవనాలు కానీ, ప్రభుత్వ వ్యతిరేక వోటు కానీ ఉండే పరిస్థితులు లేవు అని తెలిసి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు టీడీపీకి పట్టు ఉన్న గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో మరియు ఉత్తర కోస్తా ప్రాంతంలో ప్రజారాజ్యం రంగంలోకి దిగే పరిస్థితులు తెచ్చారు. దానితో ఆ ప్రాంతాల్లో టీడీపీ బీసీ వోటుబ్యాంకుకు గండి పడింది. అందుకనే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మరియు బాబు అవినీతి, తెలుగు ఆత్మగౌరవం లాంటి నినాదాలతో ఎంత హోరాహోరీగా పర్యటించినా, అవకాశవాద రాజకీయంతో తెలంగాణరాష్ట్రసమితితో పొత్తు పెట్టుకుని మహాకూటమి అవతారమెత్తి తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినా, వైఎస్సార్ విజేతగా నిలిచి ప్రతిపక్ష పార్టీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయగలిగారు.

సరే ఇదంతా ఒక ఎత్తయితే, దురదృష్టకరమైన పరిస్థితిలో వైఎస్సార్ దుర్మరణం మరణశయ్య మీద ఉన్న టి.ఆర్.ఎస్ కు ప్రాణంపోసి నట్టయింది. ప్రకృతి విపత్తులు, హైదరాబాద్ ఆరవ జోన్ వివాదం, రోశయ్య-జగన్ మధ్య జరిగిన అంతర్యుద్ధం ఇవి టి.ఆర్.ఎస్ కు మంచి ఊతం ఇచ్చాయి. దానితో ప్రభంజనంలా కేసీఆర్ దీక్షచేసి ఉద్యమాన్ని ప్రజ్వలించారు. దీనికి మన చిదంబరం గారు ఆజ్యం పోసి, తెలంగాణ ప్రక్రియ మొదలయ్యిందని చెప్పగానే తమ రాజకీయ ఉనికికే ఎసరు అని గ్రహించిన సీమాంధ్ర నేతలు పార్టీలకతీతంగా ఏకమై మూకుమ్మడి రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించారు. ఇక ఆంద్ర రాష్ట్రం రావణ కాష్టమయ్యింది ఒక రెండు నెలలు. దానితో దిమ్మ తిరిగిన మేడం, గృహ శాఖామాత్యులు మనముందు శ్రీకృష్ణ కమీటిని వేసి ఆ మంటలను కొన్నాళ్ళు బందీ చేశారు.

ఇదండీ సంగతి. వీటన్నిటి మధ్య తెలుగు దేశం పార్టీ నిట్టనిలువుగా చీలింది (ప్రత్యేకరాష్ట్రం వర్సెస్ సమైక్య రాష్ట్రం నినాదంపై).  బాబు తన చాణక్యుడి బుర్రను ఉపయోగించి తెలంగాణ ప్రాంతపు ఎమ్మెల్యేలలో గట్టి వాడైన నాగం జనార్ధన్ రెడ్డిని ఆ ప్రాంతపు ప్రజాప్రతినిధుల నాయకుడిగా నిర్ణయించి మీడియాలో ఆయనతో మాట్లాడించి తను తెరవెనక నాటకం నడిపించారు. తెలంగాణ, సీమాంధ్ర తనకు రెండుకళ్ళు అని డైలాగు కొట్టి తనను ప్రశ్నించిన తెలంగాణ వాదుల (తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నేతలు, టీఆరెస్, భాజపా) నోళ్ళు మూయించారు. అలా పార్టీని ఇంకా తన గుప్పిట ఉంచుకోగాలిగారు ఇప్పటివరకు. వాళ్ళు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేరు కాబట్టి ఏమి చేయలేమన్న వాదనను ముందుకు నెట్టి, రెండు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళే తెలంగాణ తేవాలి, వాళ్లకు చిత్తశుద్ధి లేదు అని కూడా వాదిస్తూ వచ్చారు.  చాలామటుకు బాబు రాజనీతి పనిచేసినట్టే లెక్క. ఈలోపల కాంగ్రెస్ పార్టీ లో జరిగిన బాగోతం అందరికి తెలిసిందే.

మరి ఇక ముంది ఏమిటి?.

౧. అంతర్గతంగా తెలంగాణ అంటే ఇష్టం లేని బాబు, ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణపై బహిరంగంగా వ్యతిరేకించలేరు. అలా చేస్తే ఆ పార్టీపై తన ఏకచ్చత్రాధిపత్యానికి ముప్పే.  అలా అని ముందు అడుగు వేసి తెలంగాణకు అనుకూలం, ఎట్టి పరిస్థితిలో అయినా తెలంగాణ రావాల్సిందే ఆనే నినాదంతో ఉప ఎన్నికల్లోకి వెళ్ళలేరు. ఇక వ్యూహం ఎలా ఉంటుంది? - కాంగ్రెస్ పార్టీ అసమర్థత, టీఆరెస్ అవకాశవాదం లాంటి నినాదాలతో వెళ్ళాలి. ఇది అంతగా పని చెయ్యని వ్యూహం. కాబట్టే నాయుడుకి ఈ ఉప ఎన్నికలపై పెద్దగా ఆశలు ఉండకపోవచ్చు. కాంగ్రెస్ ఓటమి తన గెలుపు అని అనుకోవచ్చు కానీ అది టీడీపీకి కూడా ఓటమి అని గ్రహించి తెలంగాణపై తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. ఇక పార్టీ అంతర్గతం చూస్తే, అటు బాలయ్య, సింహాద్రి, ఇటు కొందరు ముఖ్యమైన తెలంగాణ నాయకులు (ఎర్రబెల్లి, కడియం, నాగం) నాయకత్వాన్ని గమనిస్తున్నారు. బాబు ఏమాత్రం ఏమరపాటు చూపినా పార్టీలో అలజడి, నాయకత్వ మార్పుకోసం డిమాండ్లు తప్పవు.  బాలయ్యను వియ్యంకుడిని చేసుకొని, సింహాద్రిని అక్కవైపు బంధుత్వంలో కలిపి తన స్థానాన్ని ఇప్పటికి కాపడుకున్నట్టు అనిపిస్తున్నా రాజకీయంలో రక్తసంబంధం, చుట్టరికం ఒక స్థాయి తర్వాత గుర్తు ఉండదు అని బాబుగారి గతం మనకందరికీ విస్పష్టంగా చెబుతోంది.

౨. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం జగన్ ని బలహీన పరిచే ప్రయత్నంలో ఉంది. కొంతవరకు ఆ యత్నంలో సఫలమయినట్టే. రోశయ్య లేదా ఇంకొకరు ముఖ్యమంత్రి గా డిసెంబర్ ౩౧ వరకు కొనసాగుతారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక డివైడెడ్ గా ఉంటుంది అని ఇప్పటికే అందరికి తెలిసిన విషయం - అంటే - తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉండి, సమస్య పరిష్కారానికి ప్రత్యేక రాష్ట్రమొక్కటే మార్గం అని చెప్తుంది ఆ కమిటీ. కానీ, మిగిలిన ప్రాంతాల వాళ్ళనుంచి చాలా ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి అభిప్రాయలు, సమైక్యవాదం కూడా బలంగా ఉంది అని, ఆయ ప్రాంతపు ప్రజల మనోభావాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్తుంది ఈ కమిటి. మళ్ళీ మొదటికేగదా?. దీనితో టీఆరెస్ మళ్ళీ ఉద్యమం, ఉపఎన్నికల్లో గెలిచిన సమరోత్సాహంలో ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తుంది.

౩. ఆ మధ్యలో, కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికల్లో దెబ్బతిని, ప్రభుత్వాన్ని కూల్చటానికి పొంచి ఉన్న రోశయ్య వ్యతిరేకులు (ఇందులో జగన్ కూడా), తెలంగాణపై తమకు ఉనికి ఉండదు అని ఇంకొన్ని పనికిమాలిన ఎత్తులు వేస్తూ, రోశయ్యను తిడుతూ, ఇందైరేక్ట్ గా అమ్మగారి మీద బాధ్యత పెడుతూ, అటు టీఆరెస్, ఇటు టీడీపీ, ఇంకోపక్క ప్రరాపాతో నాలుగు స్తంభాలాట ఆడుతూ - బలహీన పడే పార్టీ కాంగ్రెస్సే. మరీ ఇబ్బంది అయితే రోశయ్య గారిని దింపి ఒక డమ్మీ తెలంగాణవాదిని ముఖ్యమంత్రి చేసి, ఆత్మవంచన చేస్తూ కాలం భారంగా గడిపేస్తారు.

మొత్తానికి, నా ఉద్దేశంలో, రాజకీయంగా రెండు ప్రధాన పక్షాలకి చాలా పరీక్షాకాలం. అధికార వ్యతిరేకతతో కాంగ్రెస్ కి కొంత ఎక్కువ. ఉపఎన్నికలలో ఘనవిజయం సాధిస్తే టీఆరెస్ బాగా బలపడటం, కాంగ్రెస్ రాజనీతి, వివిధప్రాంతాల ప్రజల మనోభావాల మధ్య సతమతమై ఒక ప్రాంతంలో ఉనికి కోల్పోయే పరిస్థితిలో కాంగ్రెస్, టీడీపీ - ఇదండీ మనకి వచ్చే ఏడాది పాటు ఉండబోయే రాజకీయ ముఖచిత్రం.

ఏ రాయయితేనేమి? . నష్టం మనలో ప్రతి ఒక్కరికి.

౧. అభివృద్ధి వైపు దూసుకుపోతున్న రాష్ట్రాని భ్రష్టు పట్టించాయి రాజకీయ పార్టీలు.
౨. రాష్ట్రం ప్రాంతాల వారీగా ప్రజల మనస్సులో విడిపోయినట్టే.
౩. ఇలానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేంతవరకు రాష్ట్రం ఒంటి కాలి మీద పడుతూ లేస్తూ ఉంటుంది. ఈలోపల కొన్ని అమాయకపు ప్రాణాల బలి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం, ప్రాంతీయ విద్వేషాలు, రెచ్చగొట్టే భావాలతో టీవీ చానెళ్ళు మారుమ్రోగుతుంటాయి.

ఈ సందర్భంగా తెలంగాణ విషయంలో నాదొక విన్నపం మన రాజధానిలో కూచున్న న్యాయనిర్ణేతలకు:

అమ్మా సోనియా, అయ్యా చిదంబరం గారు, వీరప్ప మొయిలీ గారు, అహ్మద్ పటేల్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు,

కొంచెం ప్రజల వైపునుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. గట్టి నిర్ణయం కావాలి కానీ అందరిని మెప్పించేది కాదు. తెలంగాణ సమస్యకు అందరికి ఆమోదయోగ్యమయిన పరిష్కారం లేదు. అందరు కొంత సర్దుకుంటే తప్ప ఈ సమస్యను అధిగమించలేరు. చిదంబరంగారు, హోం శాఖ అంటే నాలుగు మంచి ఇంగ్లీష్ సంభాషణలు చేసి, విలేఖరులను బోల్తా కొట్టించి, పొగరుగా మాట్లాడి నాకు చాలా అనుభవం, జ్ఞానము ఉన్నాయి అని మనం కాలరు ఎగరేసుకుంటే సరిపోదు. ఒక సర్దార్ వల్లభాయిపటేల్ లా జనహితము, దేశహితము అయిన నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి, అందరిని ఒప్పించి, అవసరమైతే సామదానభేదదండోపాయాలు ఉపయోగించి పరిష్కరించాలి. ఖద్దరు లుంగి, తెల్ల చొక్కా వేసుకుంటే, లేక తెల్ల చీర కట్టుకుంటే  గాంధేయులు అయిపోరు. మీ మనస్సులో, ఆలోచనల్లో, ఆచరణలో దృఢసంకల్పం, చెదరని ఆత్మ విశ్వాసం, దేశ ప్రయోజనాలను కాపాడే ఉన్నత విలువల్ని చూపించండి. ఈ సమస్య తప్పకుండ పరిష్కారమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి